పంటలున్నా తిండి కొరత! న్యూఢిల్లీ : ఈ భూమ్మీద వ్యవసాయానికి శ్రీకారం చుట్టిన తరువాత 11 వేల సంవత్సరాలలోనే మొదటిసారిగా క్రితం సంవత్సరం అత్యధిక స్థాయిలో 2226 మిలియన్ టన్నుల మేరకు ఆహార ధాన్యాలను మానవాళి పండించింది. ఈ సంవత్సరం 2189 మిలియన్ టన్నుల మేరకు ఆహార ధాన్యాలను పండించారు. అయినప్పటికీ ఆహార సంక్షోభం ముంచుకువస్తున్నది. అందరికీ తెలిసిన అననుకూల వాతావరణ పరిస్థితులు మాత్రమే ఇందుకు ప్రధాన కారణం కాదు.
ఈ సంక్షోభం ఎంతటిదో తెలుసుకోవడానికి ఒక మార్గాన్ని ఈ దిగువన సూచించడమైనది: ప్రపంచంలో ఆకలితో అలమటిస్తున్న, పౌష్టికాహారం లభించని ప్రల సంఖ్య 1990 దశకం ఆరంభంలోని దాదాపు 842 మిలియన్ల నుంచి ఈ సంవత్సరం వెయ్యి మిలియన్లకు అంటే ఒక బిలియన్ కు చేరింది. ఐక్యరాజ్య సమితి (యుఎన్) అనుబంధ సంస్థ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఒ) వేసిన అంచనా ఇది. ప్రస్తుతం ప్రపంచ జనాభా ఆరు బిలియన్లకు పైగా ఉన్నందున ప్రతి ఆరుగురిలో ఒకరు క్షుద్బాధకు గురవుతున్నారన్నమాట. శిశువుల పరిస్థితే మరీ దారుణంగా ఉంది. ప్రపంచంలో ఏదో ఒక చోట ప్రతి ఆరు సెకన్లకు ఆకలితో ఒక శిశు మరణం సంభవిస్తున్నది. అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే ఈ ఘోరం జరుగుతుండడంలో ఆశ్చర్యం లేదు.
ఇది తాత్కాలిక పరిణామమేనని ఎవరూ భావించరాదు. ప్రపంచంలో ఆహారోత్పత్తి గడచిన ఆరేళ్ళలో వినియోగం కన్నా తక్కువగా ఉన్నది. సరైన చర్యలు తీసుకోకపోతే ఈ పరిస్థితి మరింత అధ్వాన్నం కావచ్చు. ఏడాదికి కేవలం 1.1 శాతం వృద్ధి చెందినా ప్రపంచ జనాభా 2050 నాటికి 34 శాతం మేరకు తొమ్మిది బిలియన్లకుపైగా పెరగగలదని సూచిస్తున్నారు. అప్పటికి ఈ జనాభాలో దాదాపు 70 శాతం మంది పట్టణాలు, నగరాలలోనే నివసిస్తుంటారు. జనాభాలో కొందరికైనా ఆదాయం స్థాయి మరింత పెరగవచ్చు. ఇది ఆహార అలవాట్లలో మార్పునకు దారి తీయవచ్చు. ఆహారంలో ధాన్యాలు, ఇతర ముఖ్య పంటల వాటా తగ్గిపోగలదు. కూరగాయలు, పండ్లు, వంటనూనెలు, మాంసం, పాడి ఉత్పత్తులు, చేపల వాటా పెరగవచ్చు
కాగా, 2050 నాటికి ప్రపంచ జనాభా ఆహార అవసరాలు తీర్చడానికి వ్యవసాయోత్పత్తి 70 శాతం పైగా పెరగవలసిన అవసరం ఉంటుంది. అంటే దాదాపు మరొక బిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయవలసి ఉంటుంది. వర్ధమాన దేశాల ప్రధాన ఆహార పంటల దిగుబడులు ఒకే స్థాయిలో ఉంటున్న, టీ, కోకో, చక్కెర వంటి 'బ్రేక్ ఫాస్ట్ సరకులు' మూడు దశాబ్దాలలోనే అత్యధిక స్థాయిలో అమ్ముడవుతున్న సమయంలో ఇటువంటి పరిణామం చోటు చేసుకుంది.
Pages: 1 -2- News Posted: 19 December, 2009
|