కామ్రేడ్ గడ్కరి! న్యూఢిల్లీ : కమ్యూనిస్టులు ప్రకాశ్ కరత్, హరికిషన్ సింగ్ సుర్జీత్ వ్యవహరణ నుంచి పాఠాలు నేర్చుకోవలసిందిగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) కొత్త అధ్యక్షుడు నితిన్ గడ్కరికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సిద్ధాంతకర్త ఒకరు బాహాటంగానే సలహా ఇచ్చారు. ఆ సిపిఎం ప్రధాన కార్యదర్శులు ఎన్నడూ ఎన్నికలలో పోటీ చేయలేదని, పార్లమెంటరీ లేదా శాసనసభ సంబంధిత పదవులు నిర్వహించలేదని సంఘ్ మాజీ అధికార ప్రతినిధి ఎం.జి. వైద్య 'తరుణ్ భారత్' పత్రికలోని తన ఆదివారం వ్యాసంలో పేర్కొన్నారు నాగపూర్ నుంచి వెలువడే ఈ వార్తాపత్రిక సంఘ్ అభిప్రాయాలను ప్రతిబింబిస్తుంటుంది.
బిజెపి సంస్థాగత విభాగాలు, 'రాజకీయ' విభాగాల మధ్య స్పష్టమైన విభజన రేఖ ఉండాలని, ఎంపిలు ముఖ్యమైన పార్టీ పదవులకు దూరంగా ఉండాలని సంఘ్ కోరుతున్నది. కాగా, తాను రాజ్యసభ సభ్యత్వాన్ని కోరుకుంటున్నట్లుగా వచ్చిన వార్తలను గడ్కరి ఇటీవల ఖండించారు. అయితే, మహారాష్ట్ర శాసన మండలిలో తన సభ్యత్వాన్ని అట్టిపెట్టుకోవాలా అనేది ఆయన ఇంకా నిర్ణయించుకోవలసి ఉంది. కాని ఆ నిర్ణయం ఏమై ఉండాలో వైద్య చెప్పకనే చెప్పారు.
గడ్కరి తన మండలి సభ్యత్వానికి రాజీనామా చేయాలని వైద్య తన వ్యాసంలో కోరారు. '2014 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని మీరు పార్టీ వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించాలి. పార్లమెంటరీ వ్యవహారాలను అద్వానీకి, మురళీ మనోహర్ జోషికి వదలివేస్తే మంచిది' అని వైద్య తన వ్యాసంలో సూచించారు. పార్టీ వ్యవహారాలపై దృష్టిని కేంద్రీకరిస్తున్నప్పటికీ కరత్, సుర్జీత్ దైనందిన విధానపరమైన అంశాల గురించి క్షుణ్ణంగా తెలుసుకునే వారని వైద్య పేర్కొన్నారు. విధానాలకు, వ్యూహానికి రూపకల్పన చేయడానికి పార్టీ అధినేతలు శాసనవ్యవస్థలో భాగం కావలసిన అవసరం లేదని వైద్య ఆంతర్యం. సంస్థాగత, పార్లమెంటరీ విభాగాల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్లయితే సంస్థాగత విభాగం మాటే నెగ్గాలని వైద్య స్పష్టం చేశారు.
Pages: 1 -2- News Posted: 22 December, 2009
|