2009- ఎన్ని విపరీతాలు? హైదరాబాద్ : 2009 సంవత్సరం నాటకీయ సంఘటనలు, వైపరీత్యాల సంవత్సరంగా గుర్తుండిపోతుంది. ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి అకాల మరణంతో మొదలై వారసత్వ పోరు, అతలాకుతలం చేసిన వరదలతో కొనసాగి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉధృతమైన, హింసాత్మకమైన ఉద్యమం ముగుస్తోంది.
సెప్టెంబర్ 2న హెలికాప్టర్ దుర్ఘటనలో డాక్టర్ రాజశేఖరరెడ్డి మరణం రాష్ట్రాన్ని రాజకీయ సంక్షోభంలో ముంచెత్తడమే కాకుండా అధికార కాంగ్రెస్ నాయకత్వంలో వెలితిని సృష్టించింది. వైఎస్ఆర్ గా అందరూ పిలిచే రాజశేఖరరెడ్డి దాదాపు ఒంటిచేతితో తెలుగు దేశం పార్టీ (టిడిపి)ని ఎదుర్కొని 2004 ఎన్నికలలో అన్ని ప్రతిపక్షాలను సంఘటిత పరచి విజేతగా నిలిచారు. ఆయన శక్తిమంతుడైన ముఖ్యమంత్రిగా అవతరించి, ఢిల్లీలో పార్టీ నాయకులను తెర వెనుక పాత్రకే పరిమితం చేశారు.
2009లో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చిన వైఎస్ఆర్ రాష్ట్ర రాజకీయాలలో తన పట్టును మరింత బిగించారు. ఆయన పార్టీ ప్రతినిధులను అంటే ఎంఎల్ఎలు, ఎంఎల్ సిలు, ఎంపిలు, మునిసిపల్ కౌన్సిల్స్, జిల్లా పరిషత్ ల చైర్మన్ లు మొదలైనవారిని స్వయంగా ఎంపిక చేశారు. ఆయన అకాల మరణం రాష్ట్ర రాజకీయాలలో పెద్ద వెలితిని సృష్టించి, పెను సంక్షోభానికి దారి తీయడంలో ఆశ్చర్యం లేదు.
కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం అత్యంత సీనియర్ మంత్రి కొణిజేటి రోశయ్యను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. మూడు నెలల తరువాత ఆయనను కాంగ్రెస్ శాసనసభా పార్టీ (సిఎల్పి) నాయకునిగా, ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. అయితే, వైఎస్ఆర్ ఎంపిక చేసిన మంత్రులు, ఎంఎల్ఎలకు ఈ నిర్ణయం రుచించలేదు. వారు వైఎస్ఆర్ కుమారుడు, కడప ఎంపి జగన్మోహన్ రెడ్డికి తమ మద్దతు ప్రకటించి ఆయనను ముఖ్యమంత్రిని చేయాలని గట్టిగా కోరారు. మంత్రులు తమ కార్యాలయాలకు వెళ్ళకుండా 'జగన్ ను ముఖ్యమంత్రిని చేయడం' ధ్యేయంగా జరిగిన సమావేశాలకు హాజరు కాసాగడంతో దాదాపు ఒక నెల పాటు పాలన పరంగా, రాజకీయపరంగా రాష్ట్రం స్తంభించిపోయింది.
Pages: 1 -2- News Posted: 24 December, 2009
|