తెలంగాణపై డోలాయమానం న్యూఢిల్లీ : రాష్ట్రంలో పరిస్థితి మరింత క్షీణించిన పక్షంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు రంగాన్ని కేంద్రం సిద్ధం చేస్తున్నదని తెలుస్తున్నది. ఇందుకు తొలి చర్యగా గవర్నర్ నారాయణ్ దత్ తివారి స్థానంలో బాధ్యతల నిర్వహణకు అనువైన నేత కోసం కేంద్రం అన్వేషిస్తున్నదని తెలుస్తున్నది. రాష్ట్రపతి పాలన విధించిస్తే ప్రభుత్వ పాలనకు గవర్నరే సారథ్యం వహిస్తారన్నది తెలిసిందే.
ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్రపతి పాలన విధించే ప్రక్రియను అతి త్వరలోనే చేపట్టగలమని కేంద్రం ఆయనకు సూచించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపైన, ప్రశాంత పరిస్థితుల పునరుద్ధరణకు తీసుకోవలసిన చర్యలపైన చర్చించేందుకు క్యాబినెట్ కార్యదర్శి కె.ఎం. చంద్రశేఖర్ రాష్ట్రాన్ని సందర్శించవచ్చునని కూడా ఆయనకు తెలియజేశారు. నగరంలోనే ఉన్న ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబి) జాయింట్ డైరెక్టర్ మదన్ మోహన్ ముఖ్యమంత్రిని గురువారం సాయంత్రం కలుసుకున్నారు. ఈ సమావేశం దాదాపు 20 నిమిషాల సేపు జరిగిందని ఆ వర్గాలు తెలిపాయి.
తివారి స్థానంలో నియమించేందుకై కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చండీతో కేంద్రం మాట్లాడిందని, కాని ఆయన ఈ ప్రతిపాదనను తోసిపుచ్చారని ఆ వర్గాలు తెలియజేశాయి. తివారి స్థానంలో నియమించేందుకు గవర్నర్ కాని ఒక నేత కోసం కేంద్రం అన్వేషిస్తున్నదనే సూచనలు రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి.
అయితే, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే ఆలోచన చేయడం తొందరపాటే అవుతుందని న్యూఢిల్లీలోను, హైదరాబాద్ లోను కాంగ్రెస్ వర్గాలు వ్యాఖ్యానించాయి. 'తివారిని మార్చే ప్రశ్నగాని, రాష్ట్రపతి పాలన విధించే ప్రశ్న గాని తలెత్తలేదు' అని కాంగ్రెస్ పార్టీలోని అధీకృత వర్గాలు తెలిపాయి. రెండవ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ (ఎస్ఆర్ సి)ని ఏర్పాటు చేసే అవకాశం కూడా లేదని ఆ వర్గాలు స్పష్టం చేశాయి.
రాష్ట్రంలో పెరుగుతున్న అల్లర్లను అణచివేయడానికి ఎస్ఆర్ సి ఏర్పాటును కాంగ్రెస్ ఒక మార్గంగా ఇంకా భావిస్తున్నదని ఇతర వర్గాలు తెలియజేశాయి. రాష్ట్రంలో పరిస్థితి మరింత అధ్వాన్నమైతేనే రెండవ ఎస్ఆర్ సి ఏర్పాటుపై ప్రకటన వెలువడుతుందని ఆ వర్గాలు చెప్పాయి. పండుగలు, కొత్త సంవత్సరం వేడుకలు జరగనున్నందున వచ్చే వారం ప్రశాంతంగా సాగిపోవచ్చునని హోమ్ మంత్రిత్వశాఖ ఆశిస్తున్నది. 'రానున్న పది రోజులలో పరిస్థితి ఎలా పరిణమిస్తుందో చూడవలసి ఉంటుంది' అని ఒక ప్రతినిధి చెప్పారు.
కొత్త ఎస్ఆర్ సి ఏర్పాటు గురించి ప్రకటిస్తే గూర్ఖాలాండ్ (పశ్చిమ బెంగాల్), బుందేల్ ఖండ్, హరిత్ ప్రదేశ్ (రెండూ ఉత్తర ప్రదేశ్ లోవి), ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్రత్యేక రాష్ట్రాల కోసం సరికొత్తగా డిమాండ్లు రాగలవు. కేంద్ర హోమ్ శాఖ మంత్రి పి. చిదంబరం ఈ నెల 9న తెలంగాణపై ప్రకటన చేసిన తరువాత ఈ ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లకు తిరిగి ఊపిరిపోసినట్లయింది.
రెండవ ఎస్ఆర్ సిఏర్పాటు ప్రక్రియతో కాలహరణం జరుగుతుందని, ఇందుకు ఎన్నో ఏళ్ళు పట్టవచ్చునని అధికార వర్గాలు సూచించాయి. ఎస్ఆర్ సి ఏర్పాటుకు అనుకూలంగా రాజకీయ నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్లయితే ఈ అంశం కేంద్ర మంత్రివర్గ పరిశీలనకు వెళుతుందని, మంత్రివర్గం దీనిని ఆమోదించవలసి ఉంటుందని ఆ వర్గాలు సూచించాయి.
Pages: 1 -2- News Posted: 25 December, 2009
|