విదేశీ వర్శిటీలకు షాక్ న్యూఢిల్లీ : దేశంలో ఏర్పాటయ్యే విదేశీ విద్యా సంస్థలను నియంత్రించే ప్రతిపాదించే చట్టంలో చివరి క్షణంలో చేసిన మార్పుల ప్రకారం విదేశీ విద్యాలయాలు లోగడ ప్రతిపాదించిన మొత్తానికి ఐదింతల మేరకు కార్పస్ నిధిని పూచీకత్తుగా చూపవలసిన అవసరం ఉంటుంది. కేంద్ర మంత్రివర్గం ఈ మార్పులను ఆమోదించినట్లయితే, ఈ సంస్థలు కనీసం రూ. 50 కోట్ల మేరకు కార్పస్ నిధిని కేటాయించవలసి ఉంటుంది. పదిహేను రోజుల క్రితం వరకు ఈ బిల్లులో రూ. 10 కోట్ల కార్పస్ నిధిని మాత్రమే సూచించారు.
'ది టెలిగ్రాఫ్' పత్రికకు అందిన సమాచారం ప్రకారం, ఈ మొత్తాన్ని పెంచాలని ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతిపాదించగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్ డి) మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. మంత్రివర్గం పరిశీలనకు సమర్పించే ముందు 'విదేశీ విద్యా సంస్థలు (ప్రవేశం, కార్యకలాపాల నియంత్రణ) బిల్లు, 2009'లో హెచ్ఆర్ డి మంత్రిత్వశాఖ ఈ మార్పును పొందుపరుస్తున్నది. 'విశ్వసనీయత లేని' సంస్థల ప్రవేశాన్ని నిరోధించడం ఈ మార్పు ఆంతర్యమని అధికార వర్గాలు తెలియజేశాయి. అయితే, ఈ చర్య వివాదాస్పదం కావచ్చు. ఎందుకంటే ఆసక్తి ఉన్న సంస్థలను ఇది నిరుత్సాహపరచవచ్చు.
2007లో అప్పటి హెచ్ఆర్ డి మంత్రి అర్జున్ సింగ్ హయాంలో రూపొందించిన ఈ బిల్లులో యుపిఎ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు గణనీయంగా మార్పులు తీసుకువచ్చినప్పటికీ కార్పస్ నిధిని మాత్రం ఇప్పటి వరకు రూ. 10 కోట్లుగానే కొనసాగించారు.ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతిపాదన, దానిని ఆమోదించాలన్న హెచ్ఆర్ డి మంత్రిత్వశాఖ నిర్ణయం రెండూ విదేశీ విద్యాలయాలకు ప్రతిబంధకం కాగల క్లాజులు వేటినీ బిల్లులో లేకుండా చేయాలన్న ప్రధాని కార్యాలయం (పిఎంఒ) సూచనకు విరుద్ధమైనవి. అయితే, పిఎంఒ మార్చాలనుకున్న, లేదా తొలగించాలనుకున్న క్లాజులు అనేకం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, భారతీయ విద్య ప్రయోజనాల పరిరక్షణకు కీలకమైనవని ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నాయి.
వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండడంతో బిల్లును కార్యదర్శుల కమిటీ (సిఒఎస్)కు నివేదించారు. కమిటీ ఈ ముసాయిదాను క్షుణ్ణంగా పరిశీలించి తన సిఫార్సులను పంపింది. ఈ బిల్లును వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో ప్రవేశపెట్టాలనే ఆసక్తితో హెచ్ఆర్ డి మంత్రి కపిల్ సిబల్ ఉన్నారని ఆ వర్గాలు తెలిపాయి.
భారతదేశంలో ప్రవేశించే విదేశీ విద్యా సంస్థలు తమ బాధ్యతల నుంచి తప్పుకుంటే వాటి విద్యార్థులు, ఉద్యోగులు నష్టపోకుండా చూసేందుకై ప్రభుత్వం తలపెట్టిన చర్యలలో కీలకమైనది ఈ కార్పస్ నిధి. ఏదైనా విశ్వవిద్యాలయం తన విదేశీ విద్య సౌకర్యం కల్పించే ముద్రను కోల్పోయినా లేక దేశంలో తమ సంస్థను మూసివేయాలని నిర్ణయించుకున్నా ఉద్యోగులకు చెల్లింపులు జరపడానికి, ప్రత్యామ్నాయ ఉన్నత విద్యావకాశాల అన్వేషణలో విద్యార్థులకు తోడ్పడడానికి కేంద్రం ఈ నిధిని, సంస్థ ఆస్తులను వినియోగిస్తుంది.
Pages: 1 -2- News Posted: 26 December, 2009
|