తెలంగాణ 'రియల్' షాక్ హైదరాబాద్ : రియల్టర్లు షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు. భాగ్యనగరిలోఒకప్పుడు కనకవర్షం కురిపించిన స్థిరాస్తుల రంగం ఇప్పుడు పెద్ద గుదిబండగా మారింది. ఆర్ధిక మాంద్యం దెబ్బుకు దాదాపు రెండేళ్లపాటు రెండు కళ్లూ తేలేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం 'తెలంగాణ' దెబ్బతో మరింత సంక్షోభంలోకి కూరుకుపోతోంది. వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిన రియల్టర్లు నెత్తిన చెంగేసుకోక తప్పేటట్లు లేదు. ఐటి ఉద్యోగుల పుణ్యమాని ఆస్తులు హాట్ కేకులుగా అమ్ముడుపోయేవి. బూమ్...బూమ్ అంటూ బిల్డర్ల ఇష్టానుసారం ధరలు నిర్ణయించిన గతించాయి. ఇప్పుడు ఆ ఉత్సాహం హరించుకుపోయింది. తాము చేపట్టిన ప్రాజెక్టులు ఒక్కసారిగా గుండెలపై కుంపట్లుగా మారిపోవడంతో డెవలపర్లు కుదేలైపోయారు. నివాస, వాణిజ్య భవనాల సముదాయాల కోసం స్థలాలు కొనుగోలు చేసిన పలువురు బిల్డర్లు ఇకముందు ఏమి చేయాలో తోచక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. కొనుగోలుదారులలో ఆసక్తి నశించింది. ఇప్పటికే ప్రాజెక్టు ప్రారంభించిన వారు వాటిని ఎలా పూర్తి చేయాలో, అమ్ముడుపోకుండా మిగిలిపోయినవాటిని ఎలా వదిలించుకోవాలో తెలియని స్థితిలో పడ్డారు.
ఈ రంగాన్ని వేధిస్తున్న వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే పలువురు తమ ప్రాజెక్టులను వాయిదా వేసుకోవలసి వస్తున్నదని నిర్మాణ పరిశ్రమలోని వారు నిస్సంకోచంగా అంగీకరిస్తున్నారు. 'అసంపూర్తిగా ఉన్న కట్టడాలు, పురోగతిలేని ప్రాజెక్టులు మున్ముందు వివిధ ప్రదేశాలలో దృగ్గోచరం కానున్నాయి' అని ఒక బిల్డర్ చెప్పారు. జాగింగ్ ట్రాక్ లు, అత్యున్నత స్థాయి ఫెన్సింగ్ తో, అల్ట్రా-మోడర్న్ అపార్టుమెంట్లలో విలాసవంతమైన జీవితాన్ని సమకూర్చే నిటారు టవర్లతో కూడిన బస్తీలుగా విలసిల్లవలసిన సముదాయాలు ఇప్పుడు కనీసం నిర్మాణాన్నైనా పూర్తి చేసుకోలేని స్థితిలో పడ్డాయి. మొండిగోడలతో బూత్ బంగ్లాల్లా మారిపోయే ప్రమాదం ఉందనీ ఆయన ఆవేదన చెందారు. నగరంలోను, పరిసర ప్రాంతాలలోను, చాలా వరకు శివారు ప్రాంతాలలోను సుమారు 300 ప్రాజెక్టులు రావలసి ఉంది. 'వాటిలో నిర్మాణ పనులు సాగుతుండాలి. కాని చిన్నవి, పెద్దవి కలిపి కనీసం 200 పైచిలుకు ప్రాజెక్టులు వివిధ సమస్యలలో చిక్కుకున్నట్లు నా భావన. కొనుగోలుదారులు ఉత్సాహం చూపకపోవడమే ప్రధాన సమస్యగా ఉన్నది' అని ఒక బిల్డర్ చెప్పారు. బూమ్ సమయంలో నిర్మాణ పరిశ్రమలోని వారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన ప్రయత్నించారు.
ఇంకా ప్రారంభించవలసి ఉన్న ప్రాజెక్టులను వాయిదా వేస్తున్నారని, ఇప్పటికే పనులు ప్రారంభమైన ప్రాజెక్టులను నిలుపుదల చేస్తున్నారని ఈ పరిశ్రమలో ఉన్న మరి కొందరు తెలియజేశారు. 'అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. భారీగా మదుపు పెట్టినవారు చాలా మంది పరిస్థితి కుడితిలో పడిన ఎలుక చందంగా ఉన్నది' అని మరొక బిల్డర్ పేర్కొన్నారు. ఆయన తన 16 యూనిట్ల నాలుగు అంతస్తుల అపార్టుమెంట్ ప్రాజెక్టును నిలుపుదల చేశారు.
Pages: 1 -2- News Posted: 28 December, 2009
|