నేతల నైతిక 'హద్దులు' న్యూఢిల్లీ : రాజకీయ నాయకుల ప్రైవేట్ జీవితాలకు అంతగా ప్రాముఖ్యం ఇవ్వని దేశంలో అసభ్య ప్రవర్తనతో విమర్శలకు గురవుతున్న నేతల సుదీర్ఘ జాబితాలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ 86 సంవత్సరాల నారాయణ్ దత్ తివారి తాజాగా చోటు చేసుకున్నారు. శనివారం ఆయన తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీలతో నిమిత్తం లేకుండా రాజకీయ నాయకులు 'సామాజికంగా ఆమోదయోగ్యం కాని ప్రవర్తన'కు, 'అనౌచిత్య సంబంధాల'కు పాల్పడుతుంటారని ప్రతీతి. అయితే, చాలా కేసులలో వారి అసభ్య ప్రవర్తన అందరి దృష్టికీ రాదు. ఎందుకంటే రాజకీయ వర్గాలు, మేధావులు, పౌర సమాజం, మీడియా, న్యాయవ్యవస్థ మధ్య 'బహిరంగం బహిరంగమే, ఆంతరంగికం ఆంతరంగికమే' అనే అలిఖిత సిద్ధాంతంపై ఏకాభిప్రాయం ఉండడమే.
'ఒకరి కన్నా ఎక్కువగా స్త్రీలతో సంబంధాలు కలిగి ఉండడం' అనేది దేశ రాజకీయ వ్యవస్థలో కొత్త పరిణామమేమీ కాదు. జవహర్ లాల్ నెహ్రూ, ఎడ్వినా మౌంట్ బాటెన్ మధ్య 'ప్రగాఢ మైత్రి' సంగతి అలా ఉంచితే, గతి తప్పిన రాజకీయ నాయకుల కేసులు పుంఖానుపుంఖంగా ఉన్నాయి. నెహ్రూను తీవ్రంగా విమర్శించే రామ మనోహర్ లోహియాకు ఢిల్లీ విశ్వవిద్యాలయం అధ్యాపకురాలు ఒకరితో 'లివిన్' అనుబంధం ఉన్నదనే సంగతి అందరికీ తెలుసు. కాని అది ఆయన పేరు ప్రతిష్ఠలకు ఎన్నడూ భంగం కలిగించలేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఇంకా బాల్యావస్థలోనే ఉందని అప్పటివారు భావించారు. కాని నెహ్రూ, లోహియా, తదితరుల వ్యక్తిగత జీవితాలు గౌరవప్రదంగానే ఉంటుండేవి. ఎందుకంటే వారు ఎన్నడూ అసభ్యంగా ప్రవర్తించలేదు, అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు.
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు సాథే ఒకసారి లోహియాను సమర్థించారు. ఆ సోషలిస్ట్ నాయకుడు నిజాయితీపరుడని, ఎన్నడూ అబద్ధం ఆడలేదని ఆయన చెప్పారు. 'అది ప్రత్యామ్నాయ నైతికత. లోహియా తరహాది' అని సాథే పేర్కొన్నారు. అసాంప్రదాయక సంబంధాలకు, టైగర్ వుడ్స్ తరహా విచ్చలవిడితనానికి మధ్య అంతరం ఆ విధంగా ఉంటుంది.
నెహ్రూ మంత్రివర్గంలో సభ్యుడైన ఒక నాయకుడు మధ్యప్రదేశ్ గవర్నర్ గా ఉన్నప్పుడు ఆయన అసభ్య ప్రవర్తన గురించి గుసగుసలు వినిపిస్తుండేవి. వ్యభిచారానికి ఎన్నడూ పాల్పడవద్దన్న నైతిక సూత్రాన్ని ఆయన ఉల్లంఘించినట్లు, ఆయన వ్యక్తిగత కార్యదర్శితో లైంగిక సంబంధాలు పెట్టుకున్నట్లు ఆరోపణ వచ్చింది. ఆ తరువాత జగ్జీవన్ రామ్ కుమారుడు సురేష్ రామ్ వంతు వచ్చింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థిని సుష్మా చౌధురితో సురేష్ లైంగిక సంబంధాల గురించిన ఫోటోలు 'సూర్య' పత్రికలో ప్రచురితమయ్యాయి. అప్పట్లో ఆ పత్రికకు ఇందిరా గాంధి కోడలు మేనకా గాంధి సంపాదకత్వం వహించేవారు. మేనక ధైర్యంగా ఆ ఫోటోలను ప్రచురించడం అశ్లీల దృశ్యాల నిషేధ చట్టం నిబంధనల ఉల్లంఘనే అన్న వాదన కూడా వినిపించింది. ఇందిరా గాంధి ప్రభుత్వం నుంచి ఫిరాయించి 1977లో జనతా పార్టీని అధికారంలోకి రావడానికి దోహదం చేసిన జగ్జీవన్ రామ్ ను అపఖ్యాతి పాల్జేసే ఉద్దేశంతో ఆ ఫోటోలను ప్రచురించి ఉండవచ్చు.
Pages: 1 -2- News Posted: 28 December, 2009
|