'తెలంగాణ' తెచ్చేదెవరు? హైదరాబాద్ : తెలంగాణ... దేశంలో మారుమోగిపోతున్న ఏకైక తెలుగు పదంగా ఇది రికార్డులు సృష్టించి ఉండవచ్చు. అన్ని భాషల్లో వెలువడే వార్తాపత్రికల్లో 'తెలంగాణ' పతాక శీర్షికగా ఉంటోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల టివి చానళ్లలో 'తెలంగాణ' ప్రధాన వార్తగా సంచలనాలు సృష్టిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అని పిలుచుకుంటున్న రాష్ట్రంలో మాత్రం 'తెలంగాణ' రాజకీయనాయకులకు తారకమంత్రంగా మారిపోయింది. రాజకీయపార్టీలకు అధిపత్య పోరుకు వేదికగా మారింది. 'తెలంగాణ' తో కేంద్ర స్థాయి నాయకులు ఇక్కడి ప్రజలకు అర్ధం కాకుండా ప్రకటనలు చేస్తున్నారు. ఇక్కడి పార్టీలు రోజుకో వేదిక, సమితి, కమిటీ అంటూ అయోమయం సృష్టిస్తున్నారు. అసలు తెలుగునేల మీద గత నెల రోజులుగా సాగుతున్న రాజకీయ నాటకం అర్ధం చేసుకోవడం సామాన్యునికి సాధ్యం కావడం లేదంటే అతిశయోక్తి కాదు. డిసెంబరు 9 నుంచి ఈ రాష్ట్రం రావణ కాష్టం కావడం, రోజురోజుకు బతుకు దుర్భరం కావడం, రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా బిక్కుబిక్కు మంటూ భయం భయంగా రోజులు వెళ్ళదీయడం మాత్రం తెలుగువాడికి బాగా తెలుస్తొంది.
తెలంగాణ సాధనే ధ్యేయమంటున్న రాజకీయపార్టీలు, సమైక్యాంధ్ర కావాలంటున్న నేతలు, ప్రత్యేకాంధ్ర అంటున్న నాయకులు ఎవరి కుంపటి వాళ్లే పెట్టుకుంటున్నారు. అందరూ ఐక్య కార్యాచరణ సమితి(జెఎసి)లే ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో జెఎసీ ఒక్కో పిలుపు ఇస్తోంది. వీరికి తోడు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్ధుల జెఎసి ఒకటి. తెరాస అంటే కాంగ్రెస్ కూ, తెలుగుదేశానికీ పడదు. కాని జెఎసీలో వీరంతా ఉంటారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీకో తెలంగాణ సమితి, కాంగ్రెస్ కో కమిటి. బిజెపిది ఒక కమిటి. ప్రజారాజ్యం నుంచి విడిపడిన వారిది వేరే కమిటి. కాంగ్రెస్ మంత్రులదో కమిటి. ఉమ్మడిగా క్రమశిక్షణతో ఉద్యమాలు నిర్వహించడం మాత్రం ఈ కమిటీలకు సాధ్యం కావడం లేదు. అన్ని కమిటీలు శాంతి మంత్రం జపిస్తూనే ఉన్నాయి. బస్సు దహనాలు, దాడులు, హింసాత్మక సంఘటనలు జరిగిపోతూనే ఉన్నాయి. ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడినా గానీ, ఉద్యమం మాదే అంటే మాదే అని రేపు తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రలో పట్టు సాధించాలన్న తపనే ఈ పార్టీల్లో కనిపిస్తోంది.
Pages: 1 -2- News Posted: 28 December, 2009
|