యమ'హాహాకార'నగరి హైదరాబాద్ : తాజ్ బంజారా హోటల్ గోడలకు వెనుక, విలాసవంతమైన బంజారా హిల్స్ కు రాయి వేటు దూరంలో, 'బంజారా నాలా' పరివేష్టించి ఉన్న అంబేద్కర్ నగర వాసులు గడచిన దశాబ్దిలో తమ జీవితం మరింత అధ్వాన్నంగా మారిందని, తమను ఆదుకోవడానికి ఎవరూ రావడం లేదని చెబుతున్నారు. వారు ఒక వైపు ప్రాణాంతక వ్యాధులతోను, మరొకవైపు దుర్భర దారిద్ర్యంతోను సతమతం అవుతున్నారు. మెరుపులు, తళుకులతో అందరినీ అకర్షిస్తున్న భాగ్యనగరికి మరో ముఖం ఇది. వికృతంగా, నికృష్టమైన జీవితాలకు ఆలవాలమైన హైదరాబాద్ అసలు రూపం మరి. భాగ్యవంతులకు సిరులు కురిపిస్తున్న మహానగరి గుండెల్లో పేదలను పీక్కుతినే దారిద్ర్యపు జాడలు అనేకం.
ఆ ప్రాంతానికి వెలుపల నగరంలో ఒక మోస్తరు ఇళ్ల స్థానంలో అధునాతన అపార్ట్ మెంట్లు వచ్చాయి. చిన్న రీటైల్ దుకాణాల స్థానంలో మాల్స్ చోటు చేసుకున్నాయి. కాని ఆ బస్తీ ప్రజలు మాత్రం పదేళ్ల క్రితం వలె తాత్కాలిక మట్టి ఇళ్లలోనే జీవనాన్ని సాగిస్తున్నారు. వారు ఇప్పటికీ పరిశుభ్రమైన తాగునీటికి నోచుకోవడం లేదు. అత్యంత వేగంగా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినప్పటికీ ఆ మురికివాడలో చాలా ఇళ్లకు విద్యుత్ సౌకర్యం లభించలేదు. 'క్లీన్ హైదరాబాద్' అంటూ పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఆ ప్రాంతంలో డ్రెయిన్లు బురదతో పొంగి పొర్లుతూనే ఉన్నాయి. అయితే, నిర్లక్ష్యానికి గురైంది ఆ ఒక్క ప్రాంతమే కాదు. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 10లో బంజారా నాలా పొడుగునా అన్ని బస్తీలు అనేక సంవత్సరాలుగా దారిద్ర్యంలో, అపరిశుభ్ర పరిస్థితులలో మగ్గుతున్నాయి.
అంబేద్కర్ నగర్ మురికివాడలో వర్షపు నీటి పారుదల కోసం ఉద్దేశించిన ఈ నాలా ఒక చెత్తకుప్పగా మారిపోయింది. ఇది బురద, వ్యర్థపదార్థాలు, మురుగునీటితో నిండిపోయింది. ఆ ప్రాంత వాసుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. రాజకీయ నాయకులు రావడానికి ఆ ప్రాంతానికి వస్తారు. కాని లోతట్టు ప్రదేశాలలో దుర్భర పరిస్థితిని స్వయంగా వీక్షించే బదులు పక్కా ఇళ్లు కొన్న ఉన్న ఎంట్రన్స్ వరకే వచ్చి తిరిగి వెళ్లిపోతుంటారు. 'దోమలకు ఆవాసంగా మారిన నాలా మా జీవితాలను దుర్భరం చేస్తున్నది. మేము రేయింబవళ్ళు ఈ దుర్గంధంతో సహజీవనం సాగిస్తున్నాం. మా పిల్లలు తరచు అనారోగ్యం పాలవుతుంటారు' అని బంజారా హిల్స్ లో అతి పెద్ద మురికివాడలలో ఒకటైన అంబేద్కర్ నగర్ వాసి పి. శశికళ చెప్పింది.
Pages: 1 -2- News Posted: 31 December, 2009
|