భువనేశ్వర్ : ఒరిస్సాలోని నయాగఢ్ ఆయుధాగారం దోపిడీలో పాల్గొన్న ఒక మహిళా మావోయిస్ట్ ప్రేమ విషయంలో తన సీనియర్ నాయకులు చేస్తున్న ఒత్తిడిని తప్పించుకోవడానికి పోలీసుల ముందు లొంగిపోయింది. తన ఇష్టానికి వ్యతిరేకంగా ఛత్తీస్ గఢ్ కు చెందిన ఒక మావోయిస్టు కార్యకర్తను వివాహం చేసుకోవాలని ఆమెపై సీనియర్ మావోయిస్టులు ఒత్తిడి తీసుకువస్తున్నారు.
'నేను రాజు అనే గిరిజన యువకుని ప్రేమిస్తున్నాను. కాని ఛత్తీస్ గఢ్ కు చెందిన కేడర్ శీతేష్ ను వివాహం చేసుకోవలసిందిగా నా సీనియర్లు నన్ను బలవంతం చేస్తున్నారు' అని లక్ష్మీ పిడికాక అలియాస్ సునీత బుధవారం రాయగడ పోలీసుల ముందు లొంగిపోయిన అనంతరం విలేఖరులతో చెప్పింది. తన సీనియర్ల ఒత్తిడిని తప్పించుకోవడానికై తాను మావోయిస్టు సంస్థ నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్లు 18 సంవత్సరాల సునీత తెలియజేసింది. 'మా తల్లిదండ్రులను కలుసుకోవాలని నా బాసులతో చెప్పి రాయగడ వచ్చాను. రాయగడ చేరుకున్న తరువాత నేను పోలీసులను సంప్రదించి లొంగిపోయాను' అని ఆమె వివరించింది.