'సింహ' స్వప్నం హైదరాబాద్ : బాధ్యతలు స్వీకరించి పట్టుమని నాలుగు రోజులు కూడా గడవలేదు... కానీ నాయకులకు ఆయన చికాకు కలిగిస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇ.ఎస్.ఎల్. నరసింహన్ రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ గా వచ్చిన తరువాత ఆయనను కలుసుకుని వచ్చిన తెలంగాణ నాయకులు 'అప్ సెట్' అయ్యారు. 'ఆయన తెలంగాణ ఉద్యమాన్ని కేవలం శాంతి భద్రతల సమస్యగానే తప్ప రాజకీయ సమస్యగా పరిగణించడం లేదనే అభిప్రాయం కలిగిస్తున్నారు' అని వారు చిటపటలాడుతున్నారు.
ముఖ్యమంత్రి, ఆయన మంత్రిమండలి సారథ్యంలో ఎన్నికైన ప్రభుత్వం ఉండగా ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించడానికి గవర్నర్ 'క్రియాశీలక పాత్ర' పోషిస్తుండడం పట్ల ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య, ఆయన మంత్రివర్గ సహచరులు కూడా విసుక్కుంటున్నారు. 'ఆయన ముఖ్యమంత్రిని పక్కనపెట్టి ప్రభుత్వ కార్యదర్శులు కొందరితో నేరుగా మాట్లాడుతున్నారు. చాలా సందర్భాలలో ఇలా జరుగుతోందని ముఖ్యమంత్రికి కూడా తెలియదు' అని ఉన్నత స్థాయి ప్రతినిధి ఒకరు చెప్పారు. నరసింహన్ సోమవారం న్యూఢిల్లీ వెళ్లి తాను తెలంగాణ అంశంపై వివిధ నాయకులతో జరిపిన చర్చలపై కేంద్ర హోమ్ శాఖ మంత్రి పి. చిదంబరానికి ఒక నివేదిక సమర్పించవలసి ఉంది.
గవర్నర్ ను కలుసుకున్న తెలంగాణ నాయకులలో కె. చంద్రశేఖరరావు (కెసిఆర్), జయశంకర్, విజయశాంతి, డి. శ్రీనివాస్, ఆర్. దామోదరరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కె.ఆర్. సురేష్ రెడ్డి, పి. గోవర్ధనరెడ్డి, టి. పురుషోత్తమరావు, బి. కమలాకరరావు, ఎ. చక్రపాణి, బండారు దత్తాత్రేయ, చెన్నమనేని విద్యాసాగరరావు, పలువురు మంత్రులు ఉన్నారు. నరసింహన్ పరిష్కార సారథిగా కన్నా సమస్యకారిగా మిగిలిపోతారేమోనన్న అభిప్రాయం దాదాపు వారందరికీ ఆయనతో సమావేశాల అనంతరం కలిగింది. అయితే, రోశయ్య నేతృత్వంలోని ఎందుకూ కొరగాని ప్రభుత్వమే గవర్నర్ అటువంటి బాధ్యత చేపట్టడానికి అవకాశం కల్పించిందని ఆ తెలంగాణ నాయకులు అంగీకరించారు.
Pages: 1 -2- News Posted: 2 January, 2010
|