కులాల లెక్కలు తీస్తారా? న్యూఢిల్లీ : రాజకీయంగా వివాదాస్పదం కానున్న సాంఘిక న్యాయ మంత్రిత్వశాఖ సిఫార్సు ఒకదానిని కేంద్రం ఆమోదించినట్లయితే స్వాతంత్ర్యానంతరం మొట్టమొదటిసారిగా వచ్చే సంవత్సరం దేశంలో కులం ప్రస్తావనతో జనాభా లెక్కల సేకరణ జరగవచ్చు. 2011 జనాభా లెక్కల సేకరణ (సెన్సస్)లో ఒక ప్రాధాన్యతాంశంగా కులాన్ని చేర్చాలని మంత్రిత్వశాఖ కోరిందని, ఇతర వెనుకబడిన తరగతుల (ఒబిసి) జనాభా ఎంతో విడివిడిగా వివరాలు సేకరించాలని, వారి స్థితిగతులను తిరిగి మదింపు వేయాలని మంత్రిత్వశాఖ సిఫార్సు చేసిందని, ఇది ఒబిసి జాబితాలో మార్పులకు దారి తీయగలదని అధికారులు తెలియజేశారు.
జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్ సిబిసి), వివిధ హైకోర్టులు చేసిన సూచనలను పురస్కరించుకుని మంత్రిత్వశాఖ ఈ సిఫార్సు చేసింది. దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడానికి వీలుగా మంత్రివర్గానికి ఒక నోట్ అందజేస్తారని అధికార వర్గాలు తెలిపాయి.
కులం ప్రస్తావనతో చివరిసారిగా జనాభా లెక్కల సేకరణ 1931లో జరిగింది. విభజనవాదానికి దారి తీయగలదనే కారణంతో ఆ తరువాత జనాభా లెక్కల సేకరణ సమయంలో కులం ప్రస్తావనకు స్వస్తి చెప్పారు. స్వతంత్ర భారతంలో కులాల గణన ఎన్నటికీ జరగదని దేశ తొలి హోమ్ శాఖ మంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేలే విస్పష్టంగా ప్రకటించారు కూడా. ఆతరువాత దేశంలో ఏర్పాటైన ప్రభుత్వాలు వివాదం రేగవచ్చుననే భయంతో అటువంటి సర్వే కోసం వచ్చిన అభ్యర్థనలను తోసిపుచ్చుతూ వచ్చాయి. ఇప్పుడు సరికొత్తగా వస్తున్న అభ్యర్థనలను పురస్కరించుకుని సాంఘిక న్యాయ మంత్రిత్వశాఖ 1931 తరువాత వివిధ కులాల సాంఘిక, ఆర్థిక, విద్యాపరమైన స్థితిగతులలో ప్రభుత్వ పథకాల వల్ల వచ్చిన మార్పులను మదింపు వేసేందుకు ఇటువంటి వివరాల సేకరణ అవసరమని వాదిస్తున్నది.
ఒబిసిల కోసమే కులాల వారీ జనాభా లెక్కల సేకరణ ప్రతిపాదన వచ్చిందని మంత్రిత్వశాఖ అధికారి ఒకరు అంగీకరించారు. ఉద్యోగాలలో రిజర్వేషన్ల కోసం మండల్ కమిషన్ సిఫార్సులను కేంద్రం 1990లో ఆమోదించినప్పటి నుంచి కచ్చితమైన ఒబిసి జనాభా గణాంకాల కోసం డిమాండ్లు వస్తున్నాయి. హోమ్ మంత్రిత్వశాఖ అజమాయిషీలోని సెన్సస్ డైరెక్టరేట్ వివిధ గ్రూపుల వెనుకబడిన తనాన్ని కూడా తిరిగి మదింపు వేయాలని సాంఘిక న్యాయ మంత్రిత్వశాఖ కోరుతున్నది.
Pages: 1 -2- News Posted: 4 January, 2010
|