చిదంబరంపై వత్తిడి న్యూఢిల్లీ : తెలంగాణ అంశంపై తన వైఖరిని స్పష్టం చేయాలంటూ కేంద్రంపై వత్తిడి పెరుగుతోంది. ఈ అంశాన్ని మొదటి నుంచి నెత్తినపెట్టుకున్న కేంద్ర హోం మంత్రి చిదంబరం భుజాలపై భారం అధికమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని రెండు ప్రాంతాల నాయకులూ ఎడతెరిపి ఇవ్వకుండా చిదంబరం చెవిలో జోరీగ పోరు పెడుతున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా రెండు ప్రాంతాల రాజకీయ నాయకులు ఈ విషయమై కేంద్రం అనుసరిస్తున్న తీరుకు అసంతృప్తినే వ్యక్తం చేస్తున్నారు.
బుధవారం వివిధ నాయకులు బృందాలుగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి పి. చిదంబరాన్ని కలుసుకున్నప్పుడు ఈ సంగతి స్పష్టం చేశారు. ఈ వివాదాస్పద అంశంపై కేంద్రం నుంచి ఎటువంటి స్పష్టమైన ప్రకటనా వెలువడని కారణంగా సస్పెన్స్ తో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో జన జీవనం స్తంభించింది. అయితే,కేంద్రంతో చర్చల అనంతరం రాష్ట్రంలో ఇటీవలి కాలంలో కనిపించని ప్రశాంతత బుధవారం కనిపించింది.
కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు (కెసిఆర్)తో సహా వివిధ రాజకీయ పార్టీలతో కూడిన తెలంగాణ సంయుక్త కార్యాచరణ సమితి (టిజెఎసి) సభ్యులు బుధవారం దేశ రాజధానిలో అత్యవసర సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అంశంపై కేంద్రం సకారాత్మక ప్రకటన చేసేంత వరకు శాంతియుతంగా ఉద్యమాన్ని నిర్వహించాలని వారు ఈ సమావేశంలో తీర్మానించారు. అయితే, కేంద్రం వచ్చే మూడు నాలుగు రోజుల్లో సరైన నిర్ణయం ప్రకటించని పక్షంలో తెలంగాణకు చెందిన 119 మంది ఎంఎల్ఎలు, 17 మంది ఎంపిలు, ఎంఎల్ సిల రాజీనామాలను ఆమోదించేట్లు చూసి రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించగలమని జెఎసి కన్వీనర్ ఎం. కోదండరామ్ మీడియాతో చెప్పారు.
Pages: 1 -2- News Posted: 7 January, 2010
|