ఆన్ లైన్ లో సర్టిఫికెట్లు న్యూఢిల్లీ : ఉన్నత విద్యా రంగం క్షాళన ప్రక్రియలో భాగంగా విద్యార్హతల జాతీయ డేటాబేస్ ను ఎలక్ట్రానిక్ విధానంలో ఏర్పాటు చేయాలని తమ మంత్రిత్వశాఖ యోచిస్తున్నట్లు, సర్టిఫికెట్ల ధ్రువీకరణకు, తిరిగి జారీ చేయడానికి ఇది ఉపయోగించనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్ డి) శాఖ మంత్రి కపిల్ సిబల్ మంగళవారం తెలియజేశారు.
స్కూలు బోర్డులు, విశ్వవిద్యాలయాలు జారీ చేసే సర్టిఫికెట్లను భవిష్యత్తులో ఉపయోగించడానికి ఎలక్ట్రానికి ఫార్మాట్ లో పదిలపరచేందుకు ఒక డిపాజిటరీ సృష్టి కోసం ఒక బిల్లును తీసుకురావాలని మంత్రిత్వశాఖ యోచిస్తున్నది. 'సర్టిఫికెట్ల ఫోర్జరీ పెద్ద సమస్యగా ఉంటున్నది. సర్టిఫికెట్ల ధ్రువీకరణకు యాజమాన్య సంస్థల వద్ద ఏ సౌకర్యమూ లేదు. మన సంస్థల విశ్వసనీయత ప్రశ్నార్థకం అవుతోంది. గుర్తించిన ఒక రిజిస్టర్డ్ డిపాజిటరీ ద్వారా ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో జాతీయ డేటాబేస్ ను ఎర్పాటు చేయాలని మేము యోచిస్తున్నాం' అని సిబల్ తెలిపారు.
ఈ పథకం ప్రకారం, స్కూలు బోర్డులు, విశ్వవిద్యాలయాలు, సర్టిఫికెట్ జారీ చేసే విద్యా సంస్థలకు డిపాజిటరీతో సరాసరి అనుసంధానం ఉంటుంది. సర్టిఫికెట్లను ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో పదిలపరచవచ్చు. 'ఇది భద్రమైన డిపాజిటరీ. తన సర్టిఫికెట్ కోల్పోయిన ఎవరైనా అధీకృత సర్టిఫికెట్ పొందవచ్చు. సర్టిఫికెట్ ప్రామాణికతను నిర్థారించుకోవాలనుకున్న ఎవరైనా డిపాజిటరీని సంప్రదించి ఆ పని చేయవచ్చు' అని సిబల్ సూచించారు.
Pages: 1 -2- News Posted: 13 January, 2010
|