కొత్త వర్శిటీలకు ఒకే చట్టం న్యూఢిల్లీ : భవిష్యత్తులో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలోని విశ్వవిద్యాలయాలకు ఒకే చట్టం ద్వారా గుర్తింపు ఇవ్వవచ్చు. డిగ్రీలు ప్రదానం చేసే హక్కు నుంచి విశ్వవిద్యాలయాల ఏర్పాటు ప్రక్రియను వేరు చేసేందుకు మొట్టమొదటిసారిగా ఈ చట్టం ఉపకరిస్తుంది. ప్రతిపాదిత ఉన్నత విద్యా సంస్కరణ కింద ఏదైనా కొత్త విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన ప్రతిసారి దానికి గుర్తింపు ఇచ్చేందుకు సరికొత్తగా శాసనాలు చేయవలసి వస్తున్న దశాబ్దాల నాటి విధానానికి స్వస్తి చెప్పాలని కేంద్రం యోచిస్తున్నదని ఉన్నత స్థాయి ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్ డి) మంత్రిత్వశాఖ కొత్త చట్టానికి రూపకల్పన చేస్తున్నది. ఈ శాసనానికి అనుసంధానం చేసిన షెడ్యూల్ లో కొత్త విశ్వవిద్యాలయాలను చేర్చేందుకు ప్రభుత్వాన్ని అనుమతించే ఒక వ్యవస్థను ఈ చట్టం కింద ఏర్పాటు చేస్తారని ఆ వర్గాలు తెలిపాయి. అన్ని విశ్వవిద్యాలయాలు అనుసరించేందుకు మౌలిక సూత్రాలను ఈ చట్టం నిర్దేశిస్తుంది.
ప్రతిపాదిత జాతీయ ఉన్నత విద్య, పరిశోధన కమిషన్ (ఎన్ సిహెచ్ఇఆర్) రూపురేఖలకు మెరుగులు దిద్దుతున్న నిపుణుల బృందం సిఫార్సు చేసిన ఈ బిల్లు వల్ల భవిష్యత్తులో కొత్త విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు వీలు కలుగుతుంది. డీమ్డ్ విశ్వవిద్యాలయాల ఏర్పాటులో హేతుబద్ధతకు సంబంధించి కొనసాగుతున్న వివాదాన్ని కూడా ఇది తోసిరాజంటుంది. ఏ చట్టం కిందా ఏర్పాటు కాకుండానే డిగ్రీలు ప్రదానం చేయగల విద్యా సంస్థలే డీమ్డ్ విశ్వవిద్యాలయాలు. ఎన్ సిహెచ్ఇఆర్ ఏర్పాటు కోసం ప్రతిపాదించిన మరొక చట్టంతో కలసి ఈ కొత్త బిల్లు పని చేస్తుందని నిపుణుల కమిటీ ప్రతిపాదించిన రోడ్ మ్యాప్ సూచించింది. ప్రస్తుతం, ప్రభుత్వం గాని, ప్రైవేట్ సంస్థ గాని కొత్త విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే ప్రతిపాదిత విద్యా సంస్థకు గుర్తింపు ఇచ్చేందుకు, తగిన మౌలిక వసతులు లేకుండానే డిగ్రీలు ప్రదానం చేసే హక్కులు మంజూరు చేయడానికి కొత్త చట్టం అవసరం అవుతున్నది.
Pages: 1 -2- News Posted: 13 January, 2010
|