కేసీఆర్ ఇంట్లో కుంపటి? హైదరాబాద్ : రాజకీయ భవితవ్యం కోసం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు కుటంబ సభ్యుల నడుమ ఆధిపత్యపోరు సాగుతోందన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఎన్నడూ రాజకీయ తెరపైకి రాని కవిత ఇపుడు కీలకంగా వ్యవహరించేందుకు ఉవ్విళ్లూరుతుండటం ఇందులో భాగమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తన అన్న కె టి రామారావును కిందకు నెట్టి తాను రాజకీయ తెరపైకి వచ్చేందుకు కవిత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆమె అదుర్స్ సినిమా అంశాన్ని అందిపుచ్చుకున్నారని ఉదహరిస్తున్నారు. గతంలో సిరిసిల్ల ఎమ్మెల్యే టికెట్ ను తృటిలో కోల్పోయినందున వచ్చే ఎన్నికల్లోనైనా రాబట్టుకోవాలన్న సంకల్పంతో ఆమె వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నట్లు గుర్తు చేస్తున్నారు. రాజకీయంగా క్రియాశీలకంగా నిలవాలన్న దీర్ఘకాల ప్రణాళికతోనే ఆమె అనూహ్యంగా రాజకీయ తెరపైకి వచ్చి బహిరంగ ప్రకటనలు చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.
కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని చాలా కాలంగా నడుపుతున్నప్పటికీ ఆయన కుమార్తె మాత్రం ఎప్పుడూ రాజకీయాల్లో అంతగా శ్రద్ద చూపింది లేదు. హైదరాబాద్ లోనే విద్యాభ్యాసం పూర్తి చేసిన కవిత అమెరికన్ యూనివర్శిటీలో 2001లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసారు. అనంతరం మెకానికల్ ఇంజనీరింగ్ అయిన అనిల్ కుమార్ అనే వ్యాపార వేత్తతో ఆమెకు వివాహం జరిగింది. కవిత కూడా దిల్ సుఖ్ నగర్, హిమాయత్ నగర్, సైనికపూరి ప్రాంతాల్లో బ్యూటీ సెలూన్స్ ను విజయవంతంగా నడుపుతున్నారు. అయితే 2006 సంవత్సరంలోనే కవిత తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు. పార్టీ సాంస్కృతిక విభాగం తెలంగాణ జాగృతికి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. నల్గొండ జిల్లాలో కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని వారికి ఉచితంగా విద్యను అందిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. అంతే ఆమె మళ్లీ ఉద్యమంలో ఎక్కడా కనిపించలేదు.
Pages: 1 -2- News Posted: 15 January, 2010
|