ఎబిసిడిలే రావు న్యూఢిల్లీ : ఒకటో తరగతి విద్యార్థుల్లో సగం మందికి ఏబీసీడీలు కూడా రావు. చాలా మంది బాలలు ఇప్పటికీ ఒకటి నుండి తొమ్మిది మధ్య అంకెలను సైతం గుర్తించలేని దుస్ధితి. నమ్మశక్యంగా లేకున్నా ఇది అక్షరాల నిజం. ప్రముఖ స్వచ్ఛంద విద్యా సేవా సంస్థ ప్రథమ్ నిర్వహించిన సర్వేలో ఈ చేదు నిజం వెల్లడైంది. అభివృద్థి పథంలో భారత్ దూసుకుపోతోందని, త్వరలోనే చైనాను మించి సూపర్ శక్తిగా ఆవిర్భవిస్తుందని గొప్పలకు పోతున్న వారు ఈ దుస్థితిపై నోరు మెదపలేని పరిస్థితి. భారతీయ విద్యార్ధులకు విదేశాల్లో తిరుగులేని భవితవ్యం ఉందని మురిసిపోతున్న వారికి ఇది విచారం కలిగించే వార్త. ఒకటో తరగతి విద్యార్థులపై ప్రథమ్ నిర్వహించిన సర్వేను పరిశీలించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సుతిమెత్తగా మొట్టికాయలు వేసింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంగ్లీషు విద్యలో మనదేశాన్ని చైనా సునాయాసంగా మించిపోవడం ఖాయమని వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో 44 శాతం మందికి ఏబీసీడీలు కూడా రాకపోడంపై సుప్రీం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నిర్బంధ విద్య అమలుపై కాకిలెక్కలు చూపుతున్నారు తప్పితే సమర్ధవంతంగా అమలు చేయడం లేదని మండిపడింది.
దేశవ్యాప్తంగా ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థుల అక్షర పరిజ్జ్ఞానంపై ప్రథమ్ సంస్థ ఇటీవల సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అత్యంత కఠోరమైన వాస్తవాలు వెల్లడయ్యాయి. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తోందని భావిస్తున్న గుజరాత్ రాష్ట్రంలో 25.3 శాతం మందికి ఇంగ్లీషులో ఏబీసీడీలు కూడా రావని తేలింది. అలాగే బీహర్ లో 33.4 శాతం, ఒరిస్సాలో 34.5 శాతం, అస్సాంలో 36 శాతం, జార్ఖండ్ లో 41.8 శాతం మంది ఒకటో తరగతి విద్యార్థులకు ఏబీసీడీలు కూడా రాని పరిస్థితి ఉందని తేలింది. హైటెక్ రాష్ట్రంగా ప్రఖ్యాతి గాంచిన కర్ణాటకలో కూడా 37 శాతం మంది బాలలకు కనీస అక్షర పరిజ్క్షానం కూడా లేదని ఈ సర్వేలో తేలింది. పశ్చిమ బెంగాల్ కూడా ఇది 57 శాతాన్ని మించలేకపోయింది. అయితే 85 శాతం సాధించిన కేరళ అగ్రస్థానంలో నిలవగా, హిమాచల్ ప్రదేశ్ కూడా ఫర్వాలేదనిపించుకుంది. దేశవ్యాప్తంగా ఇంగ్లీషులో కాస్త పదాలు చదవగలిగిన ఐదో తరగతి విద్యార్థులు 25.7 శాతం మంది ఉండగా, ఎనిమిదో తరగతి చదివిన వారిలో 60.2 శాతం మందికి ఆంగ్ల పదాలు కూడా పలకలేని దౌర్భాగ్య పరిస్ధితి ఉందని సర్వే తేల్చింది. త్రిపుర, గోవా, హిమాచల్ ప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో ఎనిమిదో తరగతి విద్యార్థుల్లో 80 శాతం మందికి సులువైన ఇంగ్లీషు పదాలను సైతం స్పష్టంగా ఉచ్ఛరించలేని దుస్థితి ఉంది.
Pages: 1 -2- News Posted: 16 January, 2010
|