కొత్త దారిలో రోశయ్య? హైదరాబాద్ : ఏమాత్రం అలసత్వం సహించని గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ నుంచి ఒక విధమైన ఒత్తిడి వస్తుండడంతో ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కొత్త సంవత్సరంలో కొత్త పంథాను అనుసరించాలని, రాష్ట్రంలో తన నేతృత్వంలో పని చేసే ప్రభుత్వం ఉందని అందరికీ నమ్మకం కలిగించాలని తీర్మానించుకున్నట్లు కనిపిస్తున్నది. దీని కోసం రానున్న కొన్ని వారాలలో పారిశ్రామికవేత్తలు, అధికారులు, ఎన్నికైన ప్రజా ప్రతినిధులతో ఆయన వరుసగా సమావేశం కావాలని సంకల్పించారు. ముందుగా ఈ నెల 20, 21 తేదీలల హైదరాబాద్ లో కలెక్టర్లు, ఎస్ పిల సమావేశం జరుగుతుంది. 'సిఎంతో పారిశ్రామిక సంస్థ అధిపతుల సమావేశం ఒక వారంలోగా జరుగుతుంది' అని అధికారి ఒకరు తెలియజేశారు.
తమ ఆస్తుల పరిరక్షణ జరుగుతుందని, ఇతర నగరాలకు తరలిపోవాలని ఆలోచించనక్కరలేదని పారిశ్రామికవేత్తలకు రోశయ్య తిరిగి హామీ ఇస్తారు. కాగా, రాష్ట్రాన్ని సందర్శించి చిత్తూరులో బిహెచ్ఇఎల్, ఎన్ టిపిసి విద్యుత్ కేంద్రానికి శంకుస్థాపన చేసేట్లుగా ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను ఒప్పించడానికి సిఎం కార్యాలయం (సిఎంఒ), పరిశ్రమల శాఖ ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమం కనీసం నాలుగు సార్లు వాయిదా పడింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి క్షీణించడంతో దీనిని ప్రస్తుతం నిలిపివేశారు. 'ప్రధాని కనుక పర్యటిస్తే రాష్ట్రంలో అంతా సవ్యంగా ఉందని ప్రతి ఒక్కరికీ నమ్మకం కలుగుతుంది' అని ఒక అధికారి వ్యాఖ్యానించారు.
Pages: 1 -2- News Posted: 16 January, 2010
|