డ్రైవింగ్ లైసెన్సు గగనమే న్యూఢిల్లీ : దేశంలో డ్రైవింగ్ నిబంధనలను పెద్ద ఎత్తున మార్చడానికి ప్రభుత్వం పూనుకున్నది. వాహనాలు నడపడానికి అర్హులకు గరిష్ఠ వయో పరిమితిని నిర్దేశించడం, డ్రైవింగ్ లైసెన్సు దరఖాస్తుదారులకు గుర్తింపు ఉన్న డ్రైవింగ్ స్కూల్స్ లో శిక్షణ పొందడాన్ని తప్పనిసరి చేయడం వంటి చర్యలను ప్రభుత్వం తలపెడుతున్నది.రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఈ కొత్త నిబంధనలను రూపొందిస్తున్నది. 72, 75 ఏళ్ళు దాటిన వ్యక్తులను డ్రైవింగ్ లైసెన్సు పొందకుండా నిషేధించడం ఒక ప్రత్యామ్నాయ మార్గంగా పరిశీలిస్తున్నారు. దీని వల్ల ఇప్పటికీ చురుకుగా పనులు చేసుకునే, తమ వాహనాలను సొంతంగా నడుపుకునే వృద్ధులకు ఇది నష్టదాయకం కావచ్చు. 16, 17 సంవత్సరాల వారికి కూడా లైసెన్సులు ఇవ్వరాదని కమిటీ ప్రతిపాదించింది. వారు ప్రస్తుతం మోపెడ్ లు నడిపేందుకు అర్హులు. ఈ ప్రతిపాదనల వల్ల చిన్న తరహా డ్రైవింగ్ స్కూల్స్ పై వ్యతిరేక ప్రభావం పడనున్నది. అవి గత చరిత్రలోకి వెళ్లవచ్చు.
కొత్త నిబంధనల వల్ల డ్రైవింగ్ లైసెన్సు 'గుర్తింపు నిర్థారణ పత్రం' నుంచి 'ప్రావీణ్యానికి దాఖలా'గా మారుతుందని అధికారులు చెప్పారు. సిసలైన అర్హతలు ఉన్నవారే వాహనాన్ని నడిపేట్లు చూడడం ద్వారా దేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం ఈ పథకం లక్ష్యం. దేశంలో సుమారు లక్షా 14 వేల మంది రోడ్డు ప్రమాదాలల మరణిస్తున్నారు. ప్రపంచంలో మరే దేశంలోనూ ఇంత అధిక సంఖ్యలో రోడ్డు ప్రమాదాలతో మరణాలు సంభవించడం లేదు. మోటారు వాహనాల చట్టంలో చేయదలచిన మార్పులలో రహదారులపై గరిష్ఠ వేగ పరిమితిని నిర్వచించడం కూడా ఒకటి. ఈ మార్పులను మార్చిలోగా ఖరారు చేయవచ్చునని అనుకుంటున్నారు.
Pages: 1 -2- News Posted: 16 January, 2010
|