జూనియర్లకు ప్రధాని మంత్రం న్యూఢిల్లీ : జూనియర్ మంత్రులకు తగినంత పని కల్పించే పనికి ప్రధాని మన్మోహన్ శ్రీకారం చుట్టారు. సహాయ మంత్రులు పదవులు ఇచ్చినా చేయడానికి పని లేకుండా పోయిందని, సీనియర్ మంత్రులే అన్నీ చక్కపెట్టుకుంటున్నారని జూనియర్లు వాపోయిన నేపథ్యంలో మన్మోహన్ ఈ కసరత్తు చేపట్టారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మంగళవారం తన మంత్రివర్గంలోని సహాయ మంత్రులతో సమావేశమైనప్పుడు వారికి బాధ్యతలను తిరిగి కేటాయించేందుకు ప్రయత్నిస్తారు. సహాయ మంత్రులు ప్రస్తుతం క్యాబినెట్ మంత్రుల వ్యవహార శైలిపై ఆధారపడుతున్నారు. క్యాబినెట్ మంత్రులు తమకు తగినంత పనిని కేటాయించడం లేదని సహాయ మంత్రులు ప్రధానికి ఫిర్యాదు చేశారు. 'పని సంగతి అలా ఉంచితే ఆఫీసులో నాకు తగినంత వసతి కూడా సమకూర్చలేదు' అని టూరిజం శాఖ సహాయ మంత్రి సుల్తాన్ అహ్మద్ వాపోయారు. తృణమూల్ కాంగ్రెస్ (టిసి) నాయకుడైన సుల్తాన్ అహ్మద్ ప్రధానితో మాట్లాడేందుకై ఒక చాంతాడంత జాబితాను సిద్ధం చేసుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన జూనియర్ మంత్రులు ఈ విషయమై చొరవగా మాట్లాడలేకపోతున్నారు. కాని వారూ తమకు తగినంత పని ఇవ్వడం లేదని సణుగుతున్నారు. విశిష్ట విద్యార్హతలు, చొరవ ఉన్న కొందరు విధాన నిర్ణయానికి సాయపడకుండా, చేసేందుకు ఏమీ లేకుండా ఎంత కాలం ఉండాలని ప్రశ్నిస్తున్నారు. 'ఇంకా అధ్వాన్నమేమంటే క్యాబినెట్ మంత్రి మొత్తం తన అజమాయిషీలోనే జరగాలని కోరుకున్నతరువాత మమ్మల్ని లూప్ లైన్ లో ఉంచడానికి అధికారులు ఏమాత్రం సంకోచించరు' అని పేరు వెల్లడికి ఇష్టపడని కాంగ్రెస్ పార్టీకి చెందిన సహాయ మంత్రి ఒకరు చెప్పారు. సహాయ మంత్రులకు స్పష్టంగా పని కేటాయింపు జరిగిన సందర్భాలలో కూడా విధాన నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడు క్యాబినెట్ మంత్రులు వారికి ఆ అవకాశం లేకుండా చేస్తున్నారు.
అయితే, సహాయ మంత్రులు అందరూ నిరసన వ్యక్తం చేయడం లేదు. కాంగ్రెస్ సంకీర్ణంలోని కొన్ని ప్రాంతీయ పార్టీల సహాయ మంత్రులు తమ క్యాబినెట్ మంత్రుల పట్ల సంతృప్తి వెలిబుచ్చుతున్నారు. 'గులామ్ నబీ అజాద్ (క్యాబినెట్ మంత్రి)తో కలసి పని చేయడంలో నా అనుభవం నిజంగా అద్భుతమైనది' అని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి దినేష్ త్రివేది పేర్కొన్నారు. ఆయన తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు.
ఏ జూనియర్ మంత్రికైనా పని కేటాయింపు అనేది క్యాబినెట్ మంత్రి శైలిపై ప్రస్తుతం ఆధారపడి ఉంటున్నది. ఉదాహరణకు విదేశాంగ శాఖ మంత్రిగా ఎస్.ఎం. కృష్ణ వ్యవహార శైలిని పరిగణనలోకి తీసుకుంటే సహాయ మంత్రి శశి థరూర్ కు పని సమృద్ధిగా లభిస్తున్నది. 'ఎంఇఎలో సహాయ మంత్రికి నిర్దుష్ట బాధ్యతల కేటాయింపు జరిగినందుకు నేను అదృష్టవంతుడిని. దీని వల్ల పనికి లోటే ఉండడం లేదు' అని థరూర్ తెలిపారు. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నందున మంత్రిత్వశాఖలో పని లేనివారు ఎవ్వరూ ఉండరని చమత్కారపూర్వక వ్యాఖ్యలు వినపడుతూ ఉంటాయి.
Pages: 1 -2- News Posted: 18 January, 2010
|