తెలంగాణ వలలు!

హైదరాబాద్ : అద్దాల సోయగాలతో మెరిసిపోయే షాపింగ్ మాల్స్ కు, ఇతర వాణిజ్య సముదాయాలకు, విలాస గృహాలకు రాళ్ళ దెబ్బలు తగలకుండా వలలు ఏర్పాటు చేసుకోవాలని సూచనలు అందాయి. హైదరాబాద్ నగరంలో ఆందోళన కారులు వీటినే లక్ష్యంగా చేసుకుని ఈ అద్దాలను రాళ్లతో పగులగొడుతూ ఉండటంతో ఇక వాటన్నింటికీ రక్షణ కల్పించడం సాధ్యం కాదనే అభిప్రాయానికి వచ్చిన పోలీసులు ఈ హెచ్చరికలు జారీ చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యమం ఇంకా సర్దుమణగకపోవడంతోను, మరింతగా అలజడి రేగవచ్చునని పోలీసులు భయపడుతుండడంతోను జంట నగరాలలో వాణిజ్య సంస్థలకు, ముఖ్యంగా పైనుంచి కింద వరకు అద్దాలతో ఉండే సముదాయాలకు తమ ఆస్తుల సంరక్షణకు తగిన ఏర్పాట్లు చేసుకోవలసిందిగా సలహాలు అందాయి. వాస్తవానికి ప్రధాన రహదారులలో ఉన్న వాణిజ్య సంస్థలకు 'నోటీసుల' రూపంలో ఈ సలహాలు అందాయి.
ఎస్ఆర్ నగర్ లో ఐడిబిఐ సమీపాన ఒక వాణిజ్య సంస్థకు యజమాని అయిన సంజీవ్ (పేరు మార్చడమైనది) శనివారం నగర పోలీసు శాఖ నుంచి ఒక 'నోటీస్' అందుకున్నారు. రక్షణ వలలు అమర్చుకోవలసిందని, భద్రతను కట్టుదిట్టం చేసుకోవలసిందని ఆయనను పోలీస్ శాఖ ఆదేశించింది. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావును గత నవంబర్ 29న పోలీసులు అరెస్టు చేయడంతో తెలంగాణ ఆందోళనకారులు బంజారా హిల్స్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, తార్నాక ప్రాంతాలలోని పలు వాణిజ్య సంస్థలను లక్ష్యం చేసుకున్నారు. వైఎస్ఆర్ హెలికాప్టర్ దుర్ఘటనలో అంబానీల పాత్ర ఉండి ఉండవచ్చునంటూ ఒక కథనాన్ని కొన్ని తెలుగు వార్తా చానెల్స్ ప్రసారం చేసిన తరువాత పెక్కు ప్రైవేట్ ఆస్తులను అల్లరి మూకలు ధ్వంసం చేశాయి.
Pages: 1 -2- News Posted: 26 January, 2010
|