2వ రిపబ్లిక్ లో తెలంగాణ? హైదరాబాద్ : దేశంలో రిపబ్లిక్ దినం వజ్రోత్సవాలు జరుపుకుంటున్న దశలో విశ్లేషకులు, పరిశీలకులు తెలంగాణ విషయమై ప్రత్యేకంగా ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం గత డిసెంబర్ 9న చేసిన ప్రకటన రెండవ రిపబ్లిక్ సృష్టి ఆలోచనలో భాగం కావచ్చునని వారు భావిస్తున్నారు. అయితే, అధికార వర్గాల నుంచి ఈ అభిప్రాయం వ్యక్తం కావడం లేదు. కాని రెండవ రిపబ్లిక్ నిర్మాణం మొదటి దశలో దేశంలో పలు కొత్త రాష్ట్రాల ఏర్పాటు జరగవచ్చుననేది అ వర్గాల అభిప్రాయం కావచ్చు. రెండవ దశలో కేంద్రం, రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీలో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకోవచ్చు. ఈ క్రమంలో మూడవ స్థాయి ప్రభుత్వం ఏర్పాటు అంటే జిల్లా స్థాయిలో స్థానిక స్వపరిపాలన యంత్రాంగం ఏర్పాటు జరగవచ్చు. అయితే, ఈ అభిప్రాయాలు కార్యరూపం దాల్చడానికి ఏళ్లు పూళ్లు పట్టవచ్చు. తెలంగాణ విషయంలో జరిగినట్లుగా తడబాట్లు కూడా చోటు చేసుకోవచ్చు. అందువల్ల, ఏకాభిప్రాయానికి రావడానికి, సంబంధిత వర్గాలు అన్నిటినీ సంతృప్తిపరచడానికి చాలా కాలమే పట్టవచ్చు.
మరి రెండవ రిపబ్లిక్ కు హేతుబద్ధత ఏమిటి? తాత్విక స్థాయిలో చూస్తే రిపబ్లిక్ జీవితం మానవ జీవితం వంటిదే. కాలక్రమేణా దీనికి కొత్త సమస్యలు, కొత్త సవాళ్లు ఎదురవుతుంటాయి. ఈ కొత్త వాస్తవాలను ఎదుర్కోవడానికి ఒక వ్యక్తి మాదిరిగానే రిపబ్లిక్ కూడా నిరంతరం పరివర్తనం చెందుతుండాలి. మరొక స్థాయిలో చూస్తే, గడచిన అరవై సంవత్సరాలలో దేశంలో మొత్తం మీద జరిగిన అభివృద్ధి సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ, ప్రాంతీయ అసమానతలు, లోటుపాట్లు గణనీయంగానే చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. భారతీయులలో అధిక సంఖ్యాకులు ఇంకా దారిద్ర్య రేఖకు దిగువన (బిపిఎల్) జీవనం సాగిస్తున్నారు.
అవినీతి దేశ రాజకీయ జీవితంలోకి చొచ్చుకుపోయింది. పర్యవసానంగా పాలన తీరు కూడా నానాటికీ మారిపోతున్నది. వాస్తవానికి అవినీతి దేశ సమగ్రతకే ముప్పు కలిగించేంతగా భద్రతా సమస్యగా మారిపోయింది. దీనితో దేశంలో అసంతృప్తి జీవుల సంఖ్య పెరిగిపోయి మరిన్ని రాష్ట్రాల కోసం డిమాండ్ చేయడం ఎక్కువైంది. ఇప్పుడు, తెలంగాణ, గూర్ఖాలాండ్, విదర్భ, బుందేల్ ఖండ్, మిథిలాంచల్, హరిత్ ప్రదేశ్, కచ్ - సౌరాష్ట్రతో సహా కనీసం పది కొత్త రాష్ట్రాల కోసం డిమాండ్లు వస్తున్నాయి. మధ్య భారతంలో తమ ప్రాంతాల నుంచి గిరిజనుల భూముల ఆక్రమణ అధికం అవుతుండడం ఈ ప్రాంతాలలో మావోయిస్టులు తమ బలం పెంచుకోవడానికి దారి తీస్తున్నది. దేశంలో విస్తృత ప్రాంతాలలో ప్రభుత్వ మాట చెల్లడం లేదు. చిన్న రాష్ట్రాల వల్ల పాలన ప్రజలకు చేరువలోకి వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.
Pages: 1 -2- News Posted: 27 January, 2010
|