హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమాలు ఉధృతంగా సాగించిన ఉస్మానియా వర్శిటీ విద్యార్థులకు ఉపాథి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. గతంలో పలు కార్పొరేట్ సంస్థలు ఉస్మానియాలో క్యాంపస్ ఇంటర్వ్యూలు జరపగా, ఈ ఏడాది ఇప్పటి వరకూ కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. గత మూడు నెలలుగా నిత్యం ఆందోళనలకు వేదికగా నిలిచిన ఉస్మానియా విద్యార్ధుల పట్ల కార్పొరేట్ సంస్థలు విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. ఉస్మానియాలో అభ్యసించిన విద్యార్థుల్లో ఎక్కువ మందిపై పలు రకాల కేసులు నమోదు కావడమే ఇందుకు కారణమనే అభిప్రాయం నెలకొంది. అంతేగాక ఉస్మానియా విద్యార్థలపై ఐటీ కంపెనీలు నిషేధం విధించినట్లు మరోవైపు ప్రచారం సాగుతుండటం క్యాంపస్ లో కలవరం కలిగిస్తోంది.
ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో ప్రతీ ఏటా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు మొదటి సెమిస్టర్ సమయంలో పలు కార్పొరేట్ సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించేవి. డిసెంబర్ నెలాఖరులో జోరుగా క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిగేవి. అయితే ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క క్యాంపస్ ఇంటర్య్వూ కూడా జరగలేదు. డిసెంబర్ సమయంలో క్యాంపస్ లో ప్రత్యేక తెలంగాణ కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు జరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అంతేగాక ఏకంగా యూనివర్శిటీకీ శెలవులు కూడా ప్రకటించడం కొంత మైనస్ గా మారింది. గత ఏడాది జరిపిన క్యాంపస్ ఇంటర్య్వూల్లో ఈ విద్యార్థులకు భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు లభించాయి. క్యాంపస్ లో చదువుతున్న విద్యార్థుల్లో 95 శాతం మందికి కార్పొరేట్ సంస్థల్లో ఉపాధి లభించింది. ఈ ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. మూడు వందల మంది విద్యార్థుల్లో కేవలం 150 మందికే ఉద్యోగావకాశాలు లభించాయి. దీనికి కారణం తెలంగాణ ఉద్యమంలో క్యాంపస్ కు చెందిన విద్యార్థలు కొంతమందిపై పోలీసుల కేసులు ఉన్నాయని, అందువల్లే ఓయూపై కార్పొరేట్ సంస్థలు విముఖత చూపుతున్నాయనే భావం ఉంది.
ఓయూలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లేకపోవడం జేఎన్ టియూ విద్యార్థులకు మంచి అవకాశాలను కల్పించింది. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఈసారి జేఎన్ టి యూ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు లభించాయి. క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో గత ఏడాది కంటే ఈ ఏడాది 40 శాతం ఎక్కువ పురోగతి సాధించామని జేఎన్ టి యు రెక్టార్ కిషోర్ వెల్లడించారు. మరిన్ని సంస్థలు తమ క్యాంపస్ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు అందించేందుకు ముందుకు వస్తున్నాయని ఆయన వివరించారు.
ఉస్మానియాలో క్యాంపస్ లో ఇంటర్య్వూలు తగ్గుముఖం పట్టడానికి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల కారణం అనడాన్ని ఓయూ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ వేణు గోపాల్ రెడ్డి కొట్టిపారేస్తున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్ధిక మాంద్యం కారణంగా రిక్రూట్ మెంట్ పట్ల సంస్థలు వెనకడుగు వేస్తున్నాయని చెప్పారు. ఈ ఏడాది తమ విద్యార్థులకు విస్తృతంగా ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయని ఆయన వివరించారు.