7న అగ్ని-3 ప్రయోగం

చెన్నై : ఆదివారం (7న) అగ్ని 3 ఉపరితల క్షిపణి ప్రయోగానికి ఒరిస్సా తీరంలో దమ్రా గ్రామ సమీపంలోని చిన్ని వీలర్ దీవిలో ముమ్మరంగా సన్నాహాలు జరుగుతున్నాయి. అగ్ని 3 క్షిపణిని ప్రయోగించడం ఇది నాలుగవ సారి. ఈ క్షిపణి విశ్వసనీయతను నిర్థారించుకోవడం ఈ ప్రయోగం లక్ష్యం. 'క్షిపణి వ్యవస్థల సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు ఈ ప్రయోగం జరుపుతున్నాం' అని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్ డిఒ)కు చెందిన ఉన్నత స్థాయి మిస్సైల్ ఇంజనీర్ తెలియజేశారు.
డిఆర్ డిఒ తయారు చేసిన అగ్ని 3 ఒకటిన్నర టన్నుల బరువున్న అణ్వస్త్రాలను తీసుకుపోగలదు. ఇది 3500 కిలో మీటర్లకు మించిన దూరం ప్రయాణించగలదు. చివరకు చైనాలోని కొన్ని ప్రాంతాలను కూడా లక్ష్యం చేసుకోగలదు. ఈ క్షిపణిలో రెండు దశలు ఉంటాయి. ఇవి సాలిడ్ ప్రొపెల్లంట్ లతో పని చేస్తాయి. ఈ క్షిపణి పొడవు 17 మీటర్లు, వ్యాసం రెండు మీటర్లు. ప్రయోగ సమయంలో దీని బరువు 50 టన్నులు ఉంటుంది. 2500 డిగ్రీల సెల్షియస్ కు మించిన ఉష్ణోగ్రతలో అత్యధిక వేగంతో తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశిస్తుంది. దీనికి అమర్చిన అణ్వస్త్రానికి కార్బన్ - కార్బన్ మిశ్రమాలతో తయారు చేసిన ఉష్ణ కవచం రక్షణ కల్పిస్తుంది. మొదటి అగ్ని 3 క్షిపణిని 2006 జూలై 9న ప్రయోగించారు. కాని అది విఫలమైంది. తరువాత 2007 ఏప్రిల్ 12న రెండవ సారి, 2008 మే 7న మూడవ సారి దీనిని ప్రయోగించారు. ఈ రెండు ప్రయోగాలు విజయవంతమయ్యాయి.
Pages: 1 -2- News Posted: 6 February, 2010
|