కానుకగా జాక్సన్ ప్రతిమ బెంగళూరు : సుప్రసిద్ధ పాప్ గాయకుడు మైకేల్ జాక్సన్ మరణించి ఏడు నెలలకు పైగా గడచినా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలచిపోయారు. ఆయన ఇప్పుడు 12 అడుగుల నల్ల గ్రానైట్ విగ్రహ రూపంలో అభిమానులను అలరించనున్నారు. విగ్రహాన్ని తయారుచేసిన భారతీయుడు దానిని కాలిఫోర్నియాలోని నెవర్ లాండ్ రాంచ్ లో జాక్సన్ ఎస్టేట్ కు తరలించాలని సంకల్పించారు. ఆ అమెరికన్ గాయకునికి మొక్కవోని అభిమానిగా 40 సంవత్సరాల చంద్రశేఖరన్ నల్ల గ్రానైట్ రాయితో రూపొందించిన మూడున్నర టన్నుల విగ్రహాన్ని కాలిఫోర్నియాలోని జాక్సన్ ఎస్టేట్ కు కానుకగా ఇవ్వాలని యోచిస్తున్నారు. శాంటా బార్బరా కౌంటీలోని నెవర్ లాండ్ వ్యాలీ రాంచ్ లో సువిశాలమైన జాక్సన్ ఎస్టేట్ ఉంది. ఆయన 1988 నుంచి 2005 వరకు అక్కడ నివసించారు.
బెంగళూరుకు దాదాపు 20 కిలో మీటర్ల దూరంలోని అంతర్జాతీయ ప్రదర్శన కేంద్రం (ఎఐఇసి)లలో నిర్వహిస్తున్న తొమ్మిదవ అంతర్జాతీయ గ్రానైట్స్, శిలల ప్రదర్శనలో ఏర్పాటు చేసిన జాక్సన్ విగ్రహం అధిక సంఖ్యలో సందర్శకులను ఆకర్షిస్తున్నది. 'ఈ కాలపు మహోన్నత పాప్ గాయకునికి ఇది వ్యక్తిగత నివాళి. ఏళ్ల తరబడి వేదికలపై అభిమానులను రంజింపచేసినట్లుగానే ఆయన ఇప్పుడు మా హృదయాలలో నివసిస్తున్నారు' అని ఆర్ సి గోల్డెన్ గ్రానైట్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్. చంద్రశేఖరన్ అన్నారు. 'సుప్రసిద్ధమైన జాక్సన్ ఎస్టేట్ లో ప్రతిష్ఠించేందుకై ఆ విగ్రహాన్ని బహూకరించాలని అభిలషిస్తున్నట్లుగా ఆయన కుటుంబానికి నేను ఒక లేఖ రాశాను. రవాణా చార్జీని నేను భరిస్తాను. ఇది దాదాపు 2500 డాలర్లు' అని చంద్రశేఖరన్ ఆనందంతో చెప్పారు. ఆయన కంపెనీ స్టాల్ లో ఏర్పాటు చేసిన జాక్సన్ విగ్రహాన్ని అనేక మంది సందర్శించి దానిని స్పర్శిస్తున్నారు కూడా.
చెన్నైకి చెందిన ఈ గ్రానైట్ సంస్థ విగ్రహం తయారీ కోసం 25 వేల డాలర్లు (రూ. 12 లక్షలు) భారీ మొత్తం వెచ్చించింది. బెంగళూరుకు దాదాపు 50 కిలో మీటర్ల దూరంలో కనకపురా సమీపంలోని ఒక గనిలో నుంచి తీసుకువచ్చిన ఒక భారీ శిల నుంచి ఆ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. 'కాంచీపురంలోని మా ఫ్యాక్టరీలో 45 రోజులలో జాక్సన్ రూపంలోకి గ్రానైట్ ను మార్చడానికి ఆరుగురు శిల్పులను నియోగించాం. నల్ల గ్రానైట్ పెళుసైనది కనుక రమణీయంగా విగ్రహాన్ని చెక్కడం సహనానికి, నైపుణ్యానికి పరీక్షే. విగ్రహంలో జీవ కళ ఉట్టిపడాలని మేము ఆకాంక్షించినందున విగ్రహంలో ఆయన మొహం, కళ్ళు చెక్కడం పెద్ద సవాల్ వంటిది' అని చంద్రశేఖరన్ వివరించారు.
Pages: 1 -2- News Posted: 6 February, 2010
|