ప్రేమికులారా! జాగ్రత్త హైదరాబాద్ : ప్రేమికులారా తస్మాత్ జాగ్రత్త! ప్రేమికుల రోజు (వాలంటైన్స్ డే - వి డే) సమీపిస్తున్నది. ఆ రోజు అంటే ఫిబ్రవరి 14న సంబంధిత వేడుకలను అడ్డుకోవడానికి నైతిక పోలీసులు కూడా 'సమాయత్తం' అవుతున్నారు. వి డేన ప్రేమికుల ఉత్సాహాన్ని నీరు గార్చడానికి విశ్వ హిందూ పరిషత్ (విహెచ్ పి), బజరంగ్ దళ్ నాయకత్వంలో కాషాయ పరివార్ కార్యకర్తలు సంసిద్ధులు అవుతున్నారు. ఆ రోజు పార్కులు, బహిరంగ ప్రదేశాలలో తమకు దొరికిపోయే ప్రేమికులకు వారు పెళ్లిళ్లు జరిపిస్తారు. ప్రేమికుల రోజు సంబంధిత వేడుకలు ఏవీ నిర్వహించవద్దని వారు పబ్ లు, బార్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలను హెచ్చరించారు కూడా.
'ప్రేమికుల రోజు ఉత్సవాలలో భాగంగా కార్యక్రమాలను నిర్వహించే పబ్ లు, రెస్టారెంట్లు, బార్లపై దాడులు చేయడానికి మేము వెనుకాడం. ఇది మన సంస్కృతికి, నైతిక విలువలకు విరుద్ధమైనది' అని విహెచ్ పి హైదరాబాద్ నగర శాఖ అధ్యక్షుడు ఎం. రామరాజు హెచ్చరించారు. 'వాలంటైన్స్ డేని నిషేధించండి, భారతీయ సంస్కృతిని కాపాడండి' అనే నినాదంతో వి డేకి వ్యతిరేకంగా ప్రచారోద్యమం ప్రారంభించాలని విహెచ్ పి, బజరంగ్ దళ్ యోచిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆ సంస్థలు ఒక పోస్టర్ ను విడుదల చేశాయి. 'ప్రేమ అనేది ఒక రోజు వ్యవహారం కాదు. ఎవరైనా నిజంగా ప్రేమలో పడితే వారి వివాహాన్ని మేము జరిపిస్తాం' అని ఆ రెండు సంస్థల నాయకులు తెలియజేశారు.
రామరాజు హైదరాబాద్ లో విలేఖరులతో మాట్లాడుతూ, ఫిబ్రవరి 14న ఆ వేడుకలను నిషేధించే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. ఎందుకంటే ఇది 'మన సంస్కృతికి విరుద్ధమైనది' అని, భారతీయ సంప్రదాయాలపైన, సిద్ధాంతాలపైన ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. వి డేన తమ వ్యాపారాలు కట్టివేయాలని నగరంలోని కానుకల షాపుల యజమానులకు, రెస్టారెంట్లకు, హోటళ్లకు, పూల దుకాణాల యజమానుల, పుష్పగుచ్ఛాల తయారీదారులకు రామరాజు విజ్ఞప్తి చేశారు.
Pages: 1 -2- News Posted: 9 February, 2010
|