కొత్త పుంతల్లో వాలంటైన్స్ న్యూఢిల్లీ : స్టార్ హోటల్..క్యాండిల్ లైట్ వెలుగు.. ప్రియురాలితో కలసి ముచ్చటిస్తూ వాలంటైన్స్ డే నాడు డిన్నర్ చేయడం ఇప్పటి వరకు రివాజుగా వస్తోన్న సంప్రదాయం. కానీ ఈ తరహా వేడుకలతో విసిగివేసారిన ప్రేమ జంటలు ఈ సారి వాలంటైన్స్ డేలో పాత పద్థతికి బైబై చెప్పి కొత్త పుంతలు తొక్కేందుకు తహతహలాడుతున్నాయి. ప్రేమికుల దినోత్సవం నాడు ప్రకృతి సహజ సౌందర్యం ఉట్టిపడే దీవులకు, సముద్ర తీర ప్రాంతాల్లో వాలేందుకు ప్రమ పక్షులన్నీ రెక్కలు కట్టుకుంటున్నాయి.
ఈసారి ప్రేమికుల దినోత్సవం ఆదివారం కూడా కావడం, ఐటీ బూమ్ ఇపుడిపుడే ఊపందుకోవడం యువ జంటలకు బాగా కలిసొచ్చింది. దీంతో అత్యంత ఉత్సాహంగా వేడుకలు జరుపుకునేందుకు ప్రేమికులు ఉత్సుకత చూపుతున్నారు. ఇందుకు దేశ, విదేశాల్లో ఉన్న అందమైన స్పాట్ ల కోసం జంటలు అపుడే అన్వేషణ సాగిస్తున్నాయి. ప్రేమ జంటలు మూడ్ ని గమనించిన ట్రావెల్ టూరిజం సంస్థలు అందివచ్చిన అవకాశాన్నిఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలని భావించి ఆకర్షణీయమైన ఆఫర్ లను ప్రకటిస్తున్నాయి.
'వాలంటైన్స్ డే ని ఈ సారి అత్యంత ఉత్సాహభరితంగా జరుపుకోవాలని యువత తలపోస్తోంది, ఈ మేరకు పర్యాటక, ఆతిథ్య రంగాలు కూడా ఆకర్షణీయ పథకాలు ప్రవేశపెట్టడంతో వాటికి విశేష స్పందన లభిస్తోంది' అని అంతర్జాతీయ పర్యాటక వ్యవహారాలను పర్యవేక్షించే టిఆర్ ఎసి డైరక్టర్ కవి ఘయ్ వ్యాఖ్యానించారు. ఆర్థిక మాంద్యం కారణంగా నెలకొన్న ఇబ్బందికర పరిస్థితులు ఇపుడిపుడే గట్టెక్కుతుండటంతో మళ్లీ పర్యాటక, ఆతిధ్య రంగాలకు ఊపు వస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. 29 ఏళ్ల నిషాంత్ సూద్ అనే వ్యాపారవేత్త ఈ సారి ప్రేమికుల దినోత్సవాన్ని తన భార్యతో కలసి ఇండోనేషియాలో జరుపుకోవాలని భావిస్తున్నట్లు చెప్పాడు. తాము గడిచిన డిసెంబర్ మాసంలోనే వివాహం చేసుకున్నామని, పైళ్లైన తరువాత వస్తున్న మొదటి వాలంటైన్ డే ని మధురానుభూతి మిగిల్చేలా జరుపుకోవాలని నిర్ణయించినట్లు చెప్పాడు.
Pages: 1 -2- News Posted: 9 February, 2010
|