యుఐడిలో ఐటి ప్రొఫెషనల్స్ ముంబై : దేశంలో 120 కోట్ల మంది ప్రజలకు విశిష్ట గుర్తింపు (యుఐడి) నంబర్ ను కేటాయించే ప్రాజెక్టులో చైర్మన్ నందన్ నీలేకనికి సుమారు 30 మంది ఐటి ప్రొఫెషనల్స్ సాయం చేయవచ్చు. 'ఈ అధీకృత ప్రక్రియలో ఐచ్ఛికంగా పాల్గొనేందుకై నిపుణులైన తమ ప్రొఫెషనల్స్ ను అనుమతించవలసిందిగా నేను ఐటి పరిశ్రమకు విజ్ఞప్తి చేశాను. కంపెనీలు ఒకటి రెండు సంవత్సరాల పాటు ఈ ప్రొఫెషనల్స్ కు ఇందుకోసం సెలవు ఇవ్వవచ్చు. వ్యక్తులు, సంస్థల నుంచి మాకు ఆసక్తిపూర్వక ప్రతిపాదనలు వచ్చాయి' అని నందన్ నీలేకని గురువారం ముంబైలో నాస్కామ్ లీడర్ షిప్ ఫోరమ్ లో తెలియజేశారు.
రానున్న ఐదు సంవత్సరాలలో సుమారు 60 కోట్ల మందికి విశిష్ట గుర్తింపు సంఖ్యలను జారీ చేస్తారు. మొదటి సెట్ కార్డుల జారీ 2010 ఆగస్టు, 2011 ఫిబ్రవరి మధ్య జరగవచ్చునని ఆశిస్తున్నారు. 'వచ్చే కొన్ని వారాలలో మేనేజ్జ్ సర్వీస్ ప్రొవైడర్ (ఎంఎస్ పి) కోసం ప్రతిపాదన దరఖాస్తు రూపకల్పనలో మాకు సాయం చేయడానికి ఒక కన్సల్టెంట్ ను మేము నియమిస్తాం. ఆతరువాత 120 కోట్ల మంది ప్రజల డేటాబేస్ కు సంబంధించిన టెక్నాలజీ ఎలా పని చేస్తున్నదే సరి చూడడానికి పైలట్ కార్యక్రమాలు, నిర్థారణ ప్రక్రియలు ప్రారంభిస్తాం' అని నీలేకని వివరించారు.
ఆన్ లైన్ డేటాబేస్ రక్షణకు పటిష్ఠమైన భద్రతా చర్యలు తీసుకునేట్లుగా ఎంఎస్ పి చూడవలసి ఉంటుందని నీలేకని సూచించారు. ఆన్ లైన్ ధ్రువీకరణకు అవకాశం కల్పించడం ఈ ప్లాన్ లక్ష్యమని ఆయన చెప్పారు. 'ఇతర పథకాలలో జరుగుతున్నట్లుగా ఐడి వ్యవస్థలో డూప్లికేట్లు లేకుండా చూడడం మా ప్రధాన బాధ్యత. గుర్తింపుతో సమస్య ఏమిటంటే పలు జాతీయ, రాష్ట్ర ప్రాజెక్టులలో డూప్లికేట్లు తలెత్తడం. దాని వల్ల వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలులో మోసాలు చోటు చేసుకున్నాయి' అని నీలేకని చెప్పారు.
Pages: 1 -2- News Posted: 12 February, 2010
|