మళ్ళీ 'సూపర్' సోనియా? న్యూఢిల్లీ : ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) మొదటి ప్రభుత్వానికి సామాజిక రంగం అజెండాను నిర్దేశించిన సోనియా గాంధి సారథ్యంలోని జాతీయ సలహా మండలి (ఎన్ఎసి) తిరిగి కార్యరంగంలోకి ప్రవేశించబోతున్నది. లాభసాటి (ఆదాయం వచ్చే) జోడు పదవుల వివాదం కారణంగా ఎన్ఎసి నుంచి నిష్క్రమించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా తిరిగి ఎన్ఎసికి సారథ్యం వహించడానికి ఎట్టకేలకు అంగీకరించారు. దీనితో యుపిఎ ప్రధాన పథకాల అమలుకు ఒత్తిడి తీసుకువచ్చేందుకు, వాటి పర్యవేక్షణకు వ్యవస్థాగత ఏర్పాటు జరగబోతున్నదన్నమాట.
మండలిలో సభ్యులుగా నియమించడానికి విధాన అధ్యయనకర్తల కోసం కాంగ్రెస్ ఉన్నత స్థాయి నేతలు అప్పుడే అన్వేషణ ప్రారంభించారు. ఆహార భద్రత చట్టానికి సంబంధించిన కార్యక్రమాల పరిశీలనను ప్రారంభించేందుకు, ఇప్పుడు ఉన్న, కొత్తగా ప్రారంభించబోతున్న ప్రధాన పథకాల అమలుపై నిఘా వేసేందుకు పూర్తి స్థాయి ఎన్ఎసి ఏప్రిల్ కల్లా రూపుదిద్దుకోగలదని భావిస్తున్నారు. 'ఇది సామాజిక రంగానికి సంబంధించిన ప్రణాళికా సంఘం' అని ఎన్ఎసి పరిధిలోని అంశాలపై సాగుతున్న చర్చల గురించి తెలిసిన యుపిఎ నాయకుడు ఒకరు పేర్కొన్నారు.
ఈ ప్రతిపాదిత మండలిలో సోనియా కొత్త బృందం కోసం కాంగ్రెస్ అధిష్ఠానం పేర్ల పరిశీలనను అప్పుడే ప్రారంభించింది. సోనియా పార్టీ సహచరులలో ఒకరు ఈ బృందంలో ఉండవచ్చు. పునరుద్ధరించనున్న ఎన్ఎసికి అజెండా కూడా అప్పుడే సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఆహార భద్రత చట్టం (ఎఫ్ఎస్ఎ), మత కల్లోలాల నిరోధక బిల్లు, నీరు ఆరోగ్యంపై ప్రతిపాదిత జాతీయ చట్టం ఈ అజెండాలో ప్రధానాంశాలు కాగలవని భావిస్తున్నారు.
'లాభసాటి (జోడు) పదవుల' సూత్రాన్ని ఉల్లంఘించారని ప్రతిపక్షాలు ఆరోపించిన అనంతరం సోనియా ఎన్ఎసికి రాజీనామా చేసిన విషయం విదితమే. ఎంపిలు జోడు పదవులు నిర్వహించరాదన్న నిబంధనను ఉల్లంఘించారనే కారణంగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన జయా బచ్చన్ తరహాలో సోనియా కూడా నిష్క్రమించవలసి వచ్చింది. తిరిగి రాయబరేలి నుంచి ఎన్నిక కావడానికై సోనియా తన లోక్ సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.
డాక్టర్ మన్మోహన్ సింగ్ తన రెండవ ఇన్నింగ్స్ ను ప్రారంభించినప్పుడు ఎన్ఎసిని పునరుద్ధరించరాదని పార్టీ అధిష్ఠానం నిశ్చయించింది. జోడు పదవుల చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉన్న పిటిషన్ల గురించి అధిష్ఠానం భయపడింది. అయితే, ఈ కీలక పదవిని తిరిగి చేపట్టడానికి ఆమెకు అడ్డేదీ లేదని పార్టీ సహచరులు, న్యాయ కోవిదులు నచ్చజెప్పిన మీదట ఆమె ఇందుకు అంగీకరించారు.
Pages: 1 -2- News Posted: 13 February, 2010
|