డాక్టర్లకు నీతి ..కాని? న్యూఢిల్లీ : ఔషధ సంస్థల దగ్గర నుంచి వచ్చే కానుకలు, స్పాన్సర్ షిప్ లు తిరస్కరించాలని వైద్యులకు పిలుపు ఇస్తూ మార్గదర్శక సూత్రాలు జారీ చేసిన భారత వైద్య మండలి (ఎంసిఐ) వాటిని అమలు చేసే స్థితిలో లేనని మంగళవారం తెలియజేసింది. దేశంలో వైద్య విద్యను, ప్రాక్టీసును నియంత్రించే ఎంసిఐ ఒక ప్రవర్తన నియమావళిని విడుదల చేసింది. డాక్టర్లు ఔషధ సంస్థల నుంచి కానుకలు, చెల్లింపులు, లేదా ప్రయాణ భత్యాలు, ఆతిథ్యం స్వీకరించడాన్ని ఈ నియమావళి నిషేధిస్తున్నది. వైద్య నైతిక సూత్రాలపై ఒక సదస్సుకు హాజరవుతున్న వైద్యులలో కొందరు ఈ మార్గదర్శక సూత్రాల అమలు తీరు గురించి ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనల అమలు యంత్రాంగం లేనప్పుడు, డాక్టర్లకు కానుకలు, ప్రయాణ భత్యాలు, ఆతిథ్యం ఆఫర్ చేయడం, వారు స్వీకరించడం కొనసాగుతుందని, చివరకు పేమెంట్లు కూడా పూర్తిగా నగదు లావాదేవీలుగా మారిపోవచ్చునని కొందరు డాక్టర్లు వాదించారు.
కొత్త నైతిక ప్రవర్తన నియమావళి రూపకల్పనలో పాత్ర ఉన్న ఎంసిఐ సీనియర్ అధికారి ఒకరు సదస్సులో మాట్లాడుతూ, ఈ మార్గదర్శక సూత్రాలను స్వయం నియంత్రణకు విస్తరణగా భావించాలని, ఇది ఒక క్రిమినల్ కోడ్ లేదా సివిల్ కోడ్ గా అమలు జరపలేనిదని పేర్కొన్నారు. 'నిఘా వేయజాలం. మా దృష్టికి ఏదైనా కేసు తీసుకువస్తే మేము దర్యాప్తు చేయగలం. అంతే. ఐచ్ఛికంగా (సు మోటూగా) కల్పించుకుని ఈ పని చేయలేం' అని ఎంసిఐ విద్యా విభాగం అధిపతి వేద్ ప్రకాశ్ మిశ్రా చెప్పారు. 'సర్వం వివరించేందుకు ప్రతివాదికి పూర్తిగా అవకాశం లభించగలదు. నిరూపించే బాధ్యత ఫిర్యాదీదే' అని ఆయన డాక్టర్లు, పరిశ్రమ ప్రతినిధులు, ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధుల సదస్సులో వివరించారు.
Pages: 1 -2- News Posted: 17 February, 2010
|