కాంగ్రెస్ ఖర్చు 380 కోట్లు న్యూఢిల్లీ : అధికారాన్ని అందుకోడానికి కాంగ్రెస్ పార్టీ 2009 లోక్ సభ ఎన్నికల్లోతన ప్రత్యర్థులందరినీ మట్టికరిపించింది. అంతేనా ఎన్నికల ఖర్చులో సైతం అన్ని ఇతర పార్టీలను తలదన్నేసింది. కోట్లు కుమ్మరించకపోతే అధికార పీఠం ఎలా దక్కుతుంది మరి. దేశంలోనే సంపన్నమైన పార్టీగా ఉన్న నూటపాతికేళ్ల కాంగ్రెస్ ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా మరి? కళ్ళు చెదిరే మొత్తం. 2004 ఎన్నికల కంటే మూడు రెట్లు అధికం... అంటే అక్షరాలు 380 కోట్ల రూపాయలు మాత్రమే. ఈ డబ్బే ఐక్య ప్రగతిశీల కూటమి(యుపిఎ)ని అందలం ఎక్కించింది.
ప్రధాని పీఠంపై కన్నేసిన ప్రధాన ప్రత్యర్థి లాల్ కృష్ణ అద్వానీ కలలను కల్లలు చేయడానికి సోనియా గాంధీ బృందం ఎలా డబ్బులు విరజిమ్మింది అన్న వివరాలు ఇంకా తెలియలేదు. ఎందుకంటే లోక్ సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీతో సహా మరో 19 రాజకీయ పార్టీలు ఇంకా తమ ఎన్నికల ఖర్చు వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించలేదు కాబట్టి. ఈ పార్టీలన్నంటికీ ఎన్నికల సంఘం హెచ్చరిక లేఖలు పంపింది. ఎన్నికల ఖర్చు వివరాలను సమర్పించడానికి అఖరి అవకాశం ఇస్తున్నామని హెచ్చరిస్తూ ఈ పార్టీలకు లేఖలు పంపామని ఎన్నికల సంఘం లీగల్ కౌన్సిల్ ప్రతినిధి ఎస్ కె మెండిరెట్టా వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన మూడు నెలల లోపు ఎన్నికల ఖర్చు వివరాలను తప్పనిసరిగా ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలు సమర్పించాల్సి ఉంది.
ఎన్నికల నిబంధనలు పార్టీలు ఎలా ఉల్లంఘించాయి, ఎన్నికల ఖర్చును గణనీయంగా ఎలా పెంచివేసాయి అన్న ఈ వివరాలు కూడా ఎన్నికల సంఘం నుంచి సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి బయటకు లాగినవే. దీనిలోనూ నల్లధనం ఖర్చును గురించి ఎలాంటి ప్రస్తావనా లేదు.
Pages: 1 -2- News Posted: 18 February, 2010
|