ఫోన్ల మంత్రికి గండం? బెంగళూరు : ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) అడ్డదిడ్డ దివాళా వ్యవహారాలు కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ మంత్రి ఎ. రాజా పదవికి ఎసరు తీసుకురావచ్చునని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఆ భారీ టెలికమ్ సంస్థను పట్టిపీడిస్తున్న రుగ్మతలపై టెలికమ్యూనికేషన్ల శాఖ (డిఒటి) అధికారులు రూపొందించిన నివేదికను ప్రధాని కార్యాలయం (పిఎంఒ)కు పంపినట్లు ఆ వర్గాలు తెలిపాయి.
బిఎస్ఎన్ఎల్ లో అవకతవకలకు, సంస్థ పని తీరు నాసిగా ఉండడానికి బాధ్యత కేంద్ర టెలికమ్ మంత్రిపైన, సంస్థపైన ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొన్నది. 'బడ్జెట్ ప్రతిపాదన తరువాత రాజాను టెలికమ్యూనికేషన్ల శాఖ నుంచి తప్పించే విషయమై ప్రభుత్వంలో కేంద్ర నాయకత్వం తీవ్రంగా పరిశీలిస్తున్నది' అని పేరు వెల్లడికి ఇష్టపడని ఒక అధికారి తెలిపారు. యాజమాన్యం పరంగా జవాబుదారీతనం లోపించడం, నిర్వహణ వైఫల్యం వల్ల సంస్థ పని తీరు పేలవంగా ఉందని ఆ నివేదిక పేర్కొంటున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ప్రణాళికా రచన, పరికరాల కొనుగోలు, స్టోర్స్ నిర్వహణలో సంస్థ లోపాల వల్ల ప్రస్తుత పోటీ వాతావరణంలో వృద్ధి చెందడానికి సంస్థ తంటాలు పడుతున్నదని కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ (సిఎజి - కాగ్) అభిప్రాయపడినట్లు ఆ నివేదిక తెలియజేసింది. 'బిఎస్ఎన్ఎల్ విస్తరణ ప్రణాళికల అమలులో జాప్యానికి సంస్థ లోపభూయిష్ట టెండరింగ్ ప్రక్రియ కారణమని నివేదిక పేర్కొన్నది. ఈ టెండరింగ్ ప్రక్రియ కోర్టు వివాదాలలో చిక్కుకున్నది' అని ఆ అధికారి తెలిపారు.
Pages: 1 -2- News Posted: 26 February, 2010
|