సూపర్ చోరుడు! న్యూఢిల్లీ : ఆరు వందల పైచిలుకు చోరీలకు పాల్పడినట్లుగా భావిస్తున్న ఒక వ్యక్తిని దక్షిణ ఢిల్లీ జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు 'సూపర్ చోరుడు'గా పేర్కొంటున్న సుభాష్ ను ఫిబ్రవరి 19న ప్రెస్ ఎన్ క్లేవ్ సమీపంలో అరెస్టు చేసి అతని దగ్గర నుంచి ఐదు లక్షల రూపాయలు విలువ చేసే నగలను, ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గడచిన సంవత్సర కాలంలో దొంగతనాల ద్వారా 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు సంపాదించినట్లు పోలీసు వర్గాలు తెలియజేశాయి.
కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఆర్.కె. శర్మ ఇంటిలో దొంగతనంపై పోలీసులు సాగించిన దర్యాప్తు సుభాష్ అరెస్టుకు దారి తీసింది. తాను, తన కుటుంబ సభ్యులు క్రితం సంవత్సరం డిసెంబర్ 26, 31 మధ్య నగరం విడిచి వెళ్ళినప్పుడు పుష్ప విహార్ లోని తమ ఇంటిలో విలువైన వస్తువులు చోరీ అయ్యాయని శర్మ తెలిపారు. ఫిబ్రవరి 19న పోలీసులు మోటార్ సైకిల్ పై వెళుతున్న సుభాష్ ను అటకాయించారు. కాని అతను పారిపోవడానికి ప్రయత్నించాడు. ఇద్దరు సబ్ ఇన్ స్పెక్టర్లు దిలీప్ కుమార్, సంజయ్ వెంటాడి అతనిని పట్టుకున్నారు. పోలీసులు ప్రశ్నించినప్పుడు తాను 600 పైగా చోరీలకు పాల్పడినట్లు సుభాష్ చెప్పాడని తెలుస్తున్నది. అతను గతంలో ఒకసారి అరెస్టయి జైలులో కొంత కాలం గడిపాడు కూడా.
Pages: 1 -2- News Posted: 26 February, 2010
|