ప్రణబ్ పై దీదీ ఆగ్రహం న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై ఆగ్రహంతో రగిలిపోతున్న పార్లమెంట్ సభ్యులలో రైల్వే మంత్రి మమతా బెనర్జీ కూడా ఉన్నారు. మమతా బెనర్జీ ఆగ్రహానికి కారణం లేకపోలేదు. సరకుల రవాణా కోసం సర్వీస్ పన్ను నుంచి రైల్వేలకు ఇక ఎంత మాత్రం మినహాయింపు లభించడం లేదు. అంటే అందరినీ సంతుష్టులను చేసే ఉద్దేశంతో మమత సమర్పించిన రైల్వే బడ్జెట్ ప్లాన్ ప్రకారం సాగకపోవచ్చు. రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి వచ్చిన ఇద్దరు కేంద్ర మంత్రులు మమత, ప్రణబ్ మధ్య విభేదాలను పెంచాయన్నమాట.
ప్రయాణికుల, సరకుల రవాణా చార్జీలను పెంచకపోవడం ద్వారా అందరికీ ప్రయోజనాలు సమకూరుస్తూ రైల్వే మంత్రి బుధవారం (ఫిబ్రవరి 24న) తమ శాఖ బడ్జెట్ ను సమర్పించారు. అయితే, శుక్రవారం ఆర్థిక మంత్రి ఆమె లెక్కలన్నిటినీ తారుమారు చేశారు.
రైల్వేల ద్వారా సరకుల రవాణాకు సంబంధించి సర్వీస్ పన్ను నుంచి ఎటువంటి మినహాయింపూ ఉండదని ప్రణబ్ ముఖర్జీ ప్రకటించారు. దీని వల్ల రైల్వేలకు రూ. 6000 కోట్లు ఖర్చు అవుతుంది. ఇది సరకుల రవాణా చార్జీలను పెంచడానికి దారి తీయవచ్చు. ఈ భారాన్ని వినియోగదారునిపైకి మళ్లించాలని రైల్వేలు నిర్ణయించుకున్న పక్షంలో సరకుల రవాణా చార్జీలు ఆరు శాతం, ఏడు శాతం మధ్య పెరిగే అవకాశం ఉంది.
Pages: 1 -2- News Posted: 27 February, 2010
|