మళ్లీ 'పిల్' యాడ్స్ న్యూఢిల్లీ : రాత్రి సెక్స్ సౌఖ్యం అనంతరం ఉదయం వేసుకునే గర్భ నిరోధక మాత్రలపై తిరిగి ప్రకటనలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రైవేట్ కంపెనీలు మాత్రమే కాకుండా చివరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కూడా వాటి గురించి ప్రకటనలు విడుదల చేయాలి. ఈ అత్యవసర మాత్రల ప్రకటనలను అనుమతించడంపై అనుకూల, ప్రతికూల అంశాలపై మదింపు కోసం ఇటీవల ఔషధాల సాంకేతిక సలహా బోర్డు (డిటిఎబి) నలుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ వ్యక్తం చేసిన అభిప్రాయం ఇది.
'అన్ వాంటెడ్-72', 'ఐ-పిల్' వంటి అత్యవసర గర్భనిరోధక మాత్రలపై వాణిజ్య ప్రకటనలను భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్ (డిజిసిఐ) నిషేధించింది. ఈ వాణిజ్య ప్రకటనలు మామూలు గర్భనిరోధక సాధనాలుగా ఈ మందుల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయని, గర్భస్రావంపై తప్పుడు సమాచారం ఇస్తున్నాయని తీవ్ర ఆందోళనలు వ్యక్తమైన తరువాత డిజిసిఐ గత జనవరి 11న ఈ చర్య తీసుకున్నది. కానీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో కూడా అత్యవసర గర్భనిరోధక మందులపై వాణిజ్య ప్రకటనలను అనుమతించాలని, వాటి సక్రమ వినియోగాన్నిప్రోత్సహించాలని డిసిజిఐకి కమిటీ సూచించింది. న్యూఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో గైనకాలజీ విభాగం అధిపతి డాక్టర్ సునీతా మిత్తల్ కమిటీకి సారథ్యం వహించారు.
'దేశంలో అత్యవసర గర్భనిరోధక సాధనాలకు సంబంధించిన అన్ని రకాల వాణిజ్య ప్రకటనలను నిషేధించారు. అరక్షిత సెక్స్ అనంతరం ఒత్తిడి నుంచి బయటపడడానికి ఒక మార్గంగా మహిళలు ఈ మందులు వేసుకుంటున్నారని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఏదో మామూలు పనిగా కాకుండా అత్యవసర చర్యగా మాత్రమే ఈ మందు వేసుకోవాలని మహిళలకు సూచించడం లేదు కూడా. అయితే, ఈ నిషేధాన్ని కనీసం రానున్న ఆరు మాసాల పాటు ఉపసంహరించరనే భావిస్తున్నాం' అని డిసిజిఐ డాక్టర్ సురీందర్ సింగ్ చెప్పారు.
'ఈ మాత్ర మహిళలకు సాధికారత కల్పించాలి కాని వివక్షపూరితం కాకూడదని డాక్టర్ మిట్టల్ కమిటీ అభిప్రాయపడుతున్నది. ఈ వాణిజ్య ప్రకటనలను ప్రచారం చేసే ముందు వీటిని సమాచార, ప్రసార (ఐబి) మంత్రిత్వశాఖ నిశితంగా పరిశీలించాలని కూడా కమిటీ సూచింది. అత్యవసర గర్భనిరోధక మాత్రలను ఏవిధంగా వాడాలి, ఎప్పుడు వాడాలి, వాటి దుష్ప్రభావాలు ఏమిటి అనే విషయాలను మహిళలకు సుబోధకం చేయాలని కమిటీ అభిప్రాయపడుతున్నది' అని మంత్రిత్వశాఖ అధికారులు తెలియజేశారు.
Pages: 1 -2- News Posted: 4 March, 2010
|