'గ్రేటర్' తప్పు ఫ్లైట్లకు ముప్పు హైదరాబాద్ : ఎయిర్ షో లో సూర్యకిరణ విమానం కూలిపోవడంతో వివిధ శాఖల మధ్య బ్లేమ్ గేమ్ మొదలైంది. తప్పు మీదంటే తప్పు మీదని ఆరోపణలు చేసుకోవడం ద్వారా తప్పుకోడానకి ప్రయత్నాలు ఎప్పటిలానే సాగుతున్నాయి. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం పరిధి (ఫన్నెల్ జోన్)లో నిబంధనలను త్రోసిరాజని భవనాలను ఎత్తుగా నిర్మంచడానికి మునిసిపల్ కార్పేరేషన్ దే బాధ్యతని ఎయిర్ పోర్టు అథారటీ ఆఫ్ ఇండియా నొక్కి వక్కాణిస్తోంది. భవనాల ఎత్తుపై గల ఆంక్షలను ఉల్లంఘించి వందలాది భవనాలను నిర్మించారు. ఇది అక్కడి నివాసులకే కాకుండా విమానాశ్రయాన్ని ఉపయోగించే వివిఐపిల ప్రాణాలకు ముప్పుగా పరిణమించింది. ఆ పరిధిలో భవనాల ఎత్తుపై గల ఆంక్షలను అమలు పరచడంలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి), సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు (ఎస్ సిబి) విఫలమయ్యాయి.
బేగంపేట విమానాశ్రయం పరిసరాలలో, ముఖ్యంగా వాణిజ్య విమానాల సర్వీసులను షంషాబాద్ విమానాశ్రయానికి తరలించిన అనంతరం అనధికార భవనాల నిర్మాణాన్ని అదుపు చేయలేకపోయినందుకు స్థానిక నగరపాలక సంస్థలను భారత విమాశ్రాయాల ప్రాధికార సంస్థ (ఎఎఐ) అధికారులు తప్పు పట్టారు. జిహెచ్ఎంసి, ఎస్ సిబి, విమానాశ్రయ అధికారుల మధ్య సమన్వయం కొరవడిన కారణంగా విమానాశ్రయం సమీపంలో వందలాది భవనాల నిర్మాణం జరుగుతున్నది. 'ఫన్నెల్', విమానాశ్రయం పరిధిలో అక్రమంగా నిర్మించిన భవనాలకు సంబంధించి వెయ్యి పైచిలుకు దరఖాస్తులు భవనాల పీనలైజేషన్ పథకం (బిపిఎస్) కింద క్రమబద్ధీకరణకై జిహెచ్ఎంసికి అందాయి.
అనధికార నిర్మాణాలను నియంత్రించే బాధ్యత పురపాలక సంస్థదేనని బేగంపేట విమానాశ్రయం డైరెక్టర్ ఆర్.కె. సింగ్లా స్పష్టం చేశారు. 'ఆ నిర్మాణాలను ఆపివేయించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఎఎఐ)కి చెందిన స్థలాలలో ఆక్రమణలను తొలగించే ప్రక్రియను మేము ప్రారంభించాం' అని ఆయన తెలియజేశారు.
Pages: 1 -2- News Posted: 4 March, 2010
|