సూర్యునిదే ఆ తప్పు! న్యూఢిల్లీ : రానున్న రెండు వారాలలో మీ టెలివిజన్ తెరపై దృశ్యాలు మసకబారిపోయినా లేక అతుకులబొంతలా కనిపిస్తున్నా, పూర్తిగా కనిపించకుండా పోయినా ఆందోళన చెందకండి. సూర్యగోళంలో పరిణామాల పర్యవసానంగా ఉపగ్రహ ప్రసారాలకు అంతరాయం కలిగి ఆవిధంగా జరుగుతుంటుంది. సూర్యునిలో మచ్చలు అనే ప్రకృతి సహజమైన పరిణామం కారణంగా మార్చి 4 నుంచి 18 వరకు ప్రపంచవ్యాప్తంగా టెలివిజన్ తెరపై దృశ్యాలకు అంతరాయం కలగవచ్చు.
భూగోళ అయస్కాంత క్షేత్రం ప్రభావంతో సూర్యునిలో మచ్చలు ఏర్పడుతుంటాయని ముంబైలోని టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసర్చ్ (టిఎఫ్ఐఆర్) సైంటిస్ట్ డాక్టర్ మయాంక్ వహియా తెలియజేశారు. 'సూర్యునిలో ఏర్పడే మచ్చల సంఖ్యను బట్టి సూర్యుని అయస్కాంత క్షేత్రం మరింత వ్యాప్తి చెంది ఎక్కువ ప్రభావం చూపుతుంటుంది. చివరకు సూర్యునిలో మచ్చలు అలా ఉద్రిక్తంగా మారిన కణాలను (జ్వాలలను) అంతరిక్షంలోకి వెదజల్లుతాయి. ఇది ఉపగ్రహ సంబంధాలను దెబ్బ తీస్తుంది' అని ఆయన వివరించారు.'అసలు సూర్యునిలో మచ్చలు ఎందుకు ఏర్పడతాయో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు' అని ఆయన చెప్పారు.
మనం టివి చూడడానికి ఇబ్బంది ఏర్పడవచ్చు కాని సూర్యునిలో మచ్చల వల్ల మన టెలివిజన్లకు గాని, సెట్ టాప్ బాక్స్ లకు గాని ఎటువంటి నష్టమూ వాటిల్లదు. 'అంతగా అయితే, టివి తెరపై దృశ్యం కొన్ని సెకన్ల పాటు అదృశ్యం కావచ్చు' అని టాటాస్కై అధికారి ఒకరు అభిప్రాయం వెలిబుచ్చారు. వినియోగదారులు తమ టెలివిజన్ సెట్లను స్విచాఫ్ చేయవలసిన అవసరం లేదని ఆయన అన్నారు.
'ప్రపంచవ్యాప్తంగా ఉపగ్రహ ప్రసారాలకు అంతరాయం వాటిల్లుతుంది. కాని సూర్యునిలో మచ్చలు ఏ సమయంలోనైనా ఒక చానెల్ కు ప్రభావం చూపబోవు. ఆ ప్రభావమూ గరిష్ఠంగా 5 నుంచి 15 నిమిషాలకు మించి ఉండదు' అని మరొక 'డైరెక్ట్-టు-హోమ్' (డిటిహెచ్) సర్వీస్ ప్రొవైడర్ మేనేజ్ మెంట్ అధికారి ఒకరు సూచించారు. ఆయన తన పేరు వెల్లడికి ఇష్టపడలేదు. 'కేబుల్ వీక్షకులపై ఈ ప్రభావం పడదు' అని మరొక అధికారి చెప్పారు. 'కేబుల్ ఆపరేటర్లు ఒక నెట్ వర్క్ ద్వారా తమ సర్వీసులు అందజేస్తారు. అయితే, వారు ప్రసారం చేసే కొన్ని చానెల్స్ మాత్రం ఉపగ్రహం సాయంతో రావచ్చు' అని ఆయన పేర్కొన్నారు.
News Posted: 4 March, 2010
|