అతివల తహతహ బెంగళూరు : ఆర్థిక స్వేచ్చ కావాలని భారతీయ యువతులు తహతహలాడుతున్నారు. తమ కాళ్ళపై తాము నిలబడాలని కోరుకుంటున్నారు. అత్యధిక సంఖ్యాక భారతీయ యువతులు తాము చదువుకోవాలని, ఉద్యోగం చేయాలని కోరుకుంటున్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) తాజాగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. వారి నిర్ణయాలకు ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక కారణాలు ఉన్నప్పటికీ సర్వేలో పాల్గొన్న 2460 మంది యువతులలో అధిక సంఖ్యాకులు తాము విజయపథంలో సాగాలని, తమ 'తల్లిదండ్రులకు, సమాజానికి సేవ చేయాల'ని ఆకాంక్షిస్తున్నట్లు ఐద్వా అధ్యక్షురాలు సుభాషిణీ అలీ జాతీయ యువతుల సమ్మేళనంలో తెలియజేశారు. ఈ సమ్మేళనాన్ని ఐద్వా నిర్వహించింది. 'ఎంపిక హక్కు' అనే శీర్షికాంశంతో నిర్వహించిన ఈ సమ్మేళనానికి వివిధ కులాలు, మతాలు, ప్రాంతాలకు చెందిన యువతులు హాజరయ్యారు.
తాము ఇష్టపడిన వ్యక్తినే తాము వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పిన యువతులు గణనీయ సంఖ్యలో ఉన్నారని సర్వేలో వెల్లడైంది. ఉదాహరణకు కర్నాటకలో ఈ అభిలాష వ్యక్తం చేసినవారు 78 శాతం మంది ఉన్నారు. హర్యానా మహిళలైతే ఇంటిలో తాము చేసే పనికి తమకు డబ్బు చెల్లించాలని కోరుకుంటున్నారు. అయితే, గృహ హింస, తమపై విధించిన ఆంక్షల కారణంగా వారు ఈ స్వాతంత్ర్యాన్ని కాంక్షిస్తున్నారు. ఉదాహరణకు రాజస్థాన్ లో సర్వే చేసిన 40 మంది మహిళలలో ఏడుగురు (17.5 శాతం మంది) సాంస్కృతిక కార్యక్రమాలలో గాని, క్రీడలలో గాని తమను పాల్గొననివ్వడం లేదని చెప్పారు తమ మెట్టినిళ్ళలో దౌర్జన్యాలకు తాము గురవుతున్నట్లు తొమ్మిది శాతం మంది తెలిపారు. అయితే, తాము స్వతంత్రులం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు మొత్తం 40 మందీ చెప్పారు.
Pages: 1 -2- News Posted: 5 March, 2010
|