బిల్లుపై బిజెపి బుజ్జగింపు న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్ బిల్లుపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న పార్టీ సభ్యులను బుజ్జగించే పనిలో భారతీయ జనతా పార్టీ పడింది. చట్టసభల్లో మూడో వంతు స్థానాలను మహిళలకు రిజర్వు చేసేందుకు ఉద్దేశించిన 108వ రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్ సభలో కూడా ఆమోదం లభించేలా బిజెపి తాజాగా మరోసారి 'విప్' జారీ చేయనున్నట్లు లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ గురువారం ఇక్కడ స్పష్టం చేశారు. రాజ్యసభలో ఇప్పటికే ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలంటూ బిజెపి తమ సభ్యులకు విప్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక లోక్ సభలో కూడా బిల్లును ప్రభుత్వం ఎప్పుడు ప్రవేశపెడితే అప్పుడు దానికి అనుకూలంగా ఓటు వేయాలంటూ తమ పార్టీ ఎంపిలకూ విప్ జారీ చేస్తామని ఆమె ప్రకటించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి లోక్ సభలో మొత్తం 116 మంది సభ్యులున్నబిజెపి మద్దతు చాలా కీలకం. బిజెపి సభ్యుల్లో ఏ కొందరు వ్యతిరేకంగా ఓటు చేసినా అసలుకే మోసం వచ్చే పరిస్థితి ఉంది.
రాజ్యసభలో బిల్లుకు అనుకూలంగా ఓటు వేసినప్పటికీ ఈ బిల్లు కారణంగా పురుషులకు ప్రాతినిధ్యం తగ్గిపోతుందంటూ కొందరు బిజెపి లోక్ సభ సభ్యులు దానికి వ్యతిరేకంగా ఓటు వేయాలనుకుంటున్నట్లు వస్తున్న వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో బిజెపిలోని టాప్ స్థాయి నాయకులు గురువారం హుటాహుటిన రంగంలో దిగారు. మహిళాబిల్లుపై అసంతృప్తితో ఉన్న ఎంపిలను లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్, రాజ్యసభలో బిజెపి నాయకుడు అరుణ్ జైట్లీ, బిజెపి మాజీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ గురువారం ఉదయం భేటీ అయ్యారు. బిల్లు విషయంలో ఎలాంటి భయాలూ పెట్టుకోవద్దని వారిని బుజ్జగించారు. మహిళా బిల్లును వ్యతిరేకిస్తున్న ప్రముఖుల్లో గోరఖ్ పూర్ ఎంపి యోగి ఆదిత్యానంద, జనతాదళ్ పరివార్ కు చెందిన వెటరన్ సోషలిస్టు, మాజీ మంత్రి హుకుందేవ్ నారాయణ్ యాదవ్, లోక్ సభలో బిజెపి చీఫ్ విప్ రమేష్ బైస్ ఉన్నారు.
News Posted: 11 March, 2010
|