ముందుచూపే ముఖ్యం
మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు మన దేశంలో జరిగే సిరీస్ లో ఘన విజయాలు సాధించగలమని ఇప్పటికే అనేకసార్లు నిరూపించింది. ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న సిరీస్ లో కూడా అద్భుతమైన ప్రతిభ కనబరచి, విదేశీ పర్యటనల్లో కూడా సిరీస్ గెలుపొందగలమని రుజువుచేసింది. అయితే శ్రీలంకలో పరిస్థితులకు, మన దేశంలో పరిస్థితులకు తేడా పెద్దగా ఉండదు కాబట్టి మంచి ఫామ్ లో వున్న మనవాళ్లు గెలుపొందడం గొప్పేమీ కాదని వాదించిన వాళ్లూ లేకపోలేదు. కాని, ఎక్కడ ఆడినా మొక్కవోని ఆత్మ విశ్వాసంతో సిరీస్ గెలుచుకుంటామని ధోనీ సేన విజయశంఖం పూరించి, విమర్శకుల నోళ్లు మూసింది.
ఇప్పుడు ఇదే ఆత్మ విశ్వాసాన్ని , ఇకముందు తమ సత్తాకు నిజంగా అగ్ని పరీక్షగా నిలిచే న్యూజిలాండ్ లో కూడా ప్రదర్శించి తమ విజయ పరంపరను నిరాఘాటంగా కొనసాగించవలసిన అవసరం ఎంతైనా వుంది. ప్రపంచ క్రికెట్ రంగంలో ఎదురులోని బలీయమైన జట్టుగా ఎదుగుతున్న భారతజట్టు ఇకపై కూడా ఇదే పంథాలో పయనిస్తుందనడానికి ఎంతమాత్రం సందేహించనవసరం లేదు.
వచ్చే వరల్డ్ కప్ మీదనే దృష్టి కేంద్రీకరించిన ధోనీ సేన, అంతవరకూ ఆడే, గెలుపొందే మ్యాచ్ లన్నీ అందుకు సోపానాలుగానే భావిస్తూ అప్రతిహతంగా సాగిపోతోంది. ఎదురుగా వున్న అంతటి ఉన్నత లక్షాన్ని సాధించాలంటే, అంతటి బలమైన జట్టును తయారుచేయాలంటే ఎంతో ఓర్పు, నేర్పు, ఏకాగ్రత అవసరం. అందుకు అనుగుణంగా ప్రయోగాలు చేయడమూ అవసరమే. ఆ ప్రక్రియలో అప్పుడప్పుడు కొన్ని పరాజయాలు ఎదురైనా వాటిని గుణపాఠాలుగా పరిగణిస్తూ ముందుకు సాగిపోతామన్న దృక్పథం భారతజట్టులోను, జట్టు మేనేజిమెంట్ లోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. నిలకడగా ఆడుతూ, భారీ స్కోర్లు నమోదుచేస్తూ ఇకపై తనను ఎంతమాత్రం విస్మరించడానికి వీల్లేదని యువరాజ్ సింగ్ చెప్పకనే చెబుతున్నాడు. మిడిల్ ఆర్డర్ అతడి ఉనికితో పటిష్టంగా తయారయింది. అలాగే కొత్త కుర్రాడు రవీంద్ర జడేజా తొలి మ్యాచ్ లోనే అర్ధ సెంచరీతో అంతర్జాతీయ క్రికెట్ రంగంలో తన ప్రవేశానికి ఢంకా బజాయించాడు. ఈ ఆల్ రౌండర్ బంతితో ఎలా రాణిస్తాడో వేచి చూడాలి.
Pages: 1 -2- News Posted: 9 February, 2009
|