'రాజు'ను మేనేజ్ చేశారా?
హైదరాబాద్: 'సత్యం' వ్యవస్థాపకుడు, ప్రస్తుతం జైలులో ఉన్న బి.రామలింగరాజును కేంద్ర సంస్థల దయాదాక్షిణ్యాలకు వదలివేసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకోవచ్చు. రాజు సోదరుల పట్ల ఒక వైపు అభిమానం ప్రదర్శిస్తూనే మరొకవైపు వారిని చట్టబద్దంగానే కస్టడీలో ఉంచినట్లుగా చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నందున ఇక రాజు సోదరులను కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించడం ఉత్తమం అని ప్రభుత్వాధినేతలు భావిస్తునట్లు తెలిసింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు దీని రాజకీయ పర్యవసానాలు చాలా తీవ్రంగానే ఉండవచ్చునని ఈ కేసును నిశితంగా పరిశీలిస్తున్న వర్గాలు పేర్కొన్నాయి.
అంతేకాకుండా ఈ కేసులో రాజకీయ సంబంధాల ఆనవాళ్ళు ఏమీ కనిపించకుండా చూసుకోవడానికి ప్రభుత్వానికి ఇప్పటికే కావలసినంత వ్యవధి లభించిందని ఆ వర్గాలు చెప్పాయి. 'ఇంతవరకు ఈ కేసు సాగిన తీరును పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్ర సిఐడి పోలీసులు అసలు సత్యం వ్యవహారంలోనే చేతులు పెట్టలేదని విదితమవుతుంది' అని ఒక ప్రతినిధి పేర్కొన్నారు. 'రాజు సోదరుల భూమి లావాదేవీలపైనే ఈ దర్యాప్తు అంతా సాగింది.. పోలీసు అధికారులు సత్యం అకౌంట్ దేనినీ పరిశీలించలేదు. వారు కనీసం సత్యం అకౌంట్లను నిర్థారించుకోవడానికి క్లయంట్లతో లేదా సంబంధిత ఇతర వ్యక్తులతో మాట్లాడేందుకు కూడా ప్రయత్నించలేదు' అని ఆయన తెలిపారు.
Pages: 1 -2- -3- News Posted: 10 February, 2009
|