బిసిసిఐపై కపిల్ నిప్పులు
న్యూఢిల్లీ: కపిల్ దేవ్ కు, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ)కి మధ్య సాగుతున్న పోరు శుక్రవారం కొత్త మలుపు తిరిగింది. బిసిసిఐ తరఫు న్యాయవాది భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ పై పదే పదే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేశారు. ప్రపంచ కప్ గెలుచుకున్న భారత జట్టు కెప్టెన్ కపిల్ నిరుడు ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ పై బోర్డు న్యాయవాది ఆయనను క్రాస్ పరీక్ష చేస్తూ ఆ ఆరోపణలకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసిఎల్)లో చేరిన మాజీ క్రికెటర్ల పెన్షన్లను నిలిపివేసినందుకు కపిల్ బిసిసిఐపై కేసు వేశారు.
మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంపై కపిల్ ను బిసిసిఐ న్యాయవాది శుక్రవారం పదేపదే ప్రశ్నించారు. దీనితో చిర్రెత్తిపోయిన కపిల్ బిసిసిఐపై తీవ్రంగా విరుచుకుపడుతూ, బోర్డు తనపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్నదని విమర్శించారు. ఆ అభియోగాలు తన ప్రతిష్ఠకేమీ భంగం కలిగించవని కపిల్ స్పష్టం చేశారు. 'మేము 1983లోనే ప్రపంచ కప్ గెలుచుకున్నామని నాకు గుర్తు. అప్పట్లో మేము మా దేశానికి సేవ చేశాం. కాని ఇప్పుడు ఆ పదం నా జీవితాన్నే మార్చివేయగలదని బిసిసిఐ భావిస్తున్నట్లయితే, 'లేదు. అలా జరగదు. నేనెవరో, నేను చేస్తున్నదేమిటో నాకు తెలుసు' అని నిర్ద్వంద్వంగా చెప్పాలనుకుంటున్నా' అని కపిల్ పేర్కొన్నారు.
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) వద్ద ఐసిఎల్ కు అనుబంధ ప్రతిపత్తి కల్పించడం గురించి ప్రశ్నకు ఐసిల్ గ్రూప్ అధిపతి హిమాంశు మోడి సమాధానం ఇస్తూ, 'మా ధ్యేయం గురించి అర్థం పర్థం లేని ప్రశ్నలతో వారు కాలయాపన చేస్తున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి మాకు అధికారిక సమాచారం ఏదీ రాలేదు. మేము వారికి చివరి అవకాశం ఇస్తూ వచ్చే 15 రోజులలోగా సమాధానం ఇవ్వాలని కోరాం. వారు అలా చేస్తే మంచిదే. అయితే అప్పటికీ వారు సమాధానం ఇవ్వలేదనుకోండి. ఇక వారి అవసరం మాకు ఉండదు' అని అన్నారు.
Pages: 1 -2- News Posted: 14 February, 2009
|