బిసిసిఐపై కపిల్ నిప్పులు
అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా ఐసిఎల్ క్రీడాకారులపై విధించిన నిషేధం గురించి కపిల్ ప్రస్తావిస్తూ, 'మా ధ్యేయం క్రికెట్ కు ప్రోత్సాహం కల్పించడమే. యువ క్రీడాకారులు కొందరు దీని వల్ల లబ్ధి పొందితే వచ్చిన సమస్య ఏమిటి? మా క్రీడాకారులు మరే జట్టుకూ లేదా వారి జాతీయ జట్లకు ఆడరాదని మేము ఎన్నడూ చెప్పలేదు. మరి వారు (బిసిసిఐ మనుషులు) ఎందుకు వారిని నిషేధిస్తున్నారు?' అని అన్నారు.
ప్రస్తుతం ఐసిఎల్ లో సుమారు 70 మంది క్రీడాకారులు ఉన్నారు. వారికి బిసిసిఐ ఇప్పటికీ బకాయిలు చెల్లించడం లేదు.కాని వారికి తిరిగి చెల్లించే ఉద్దేశం కూడా బిసిసిఐకి ఉన్నట్లు కనిపించడం లేదు. కపిల్ ఈ విషయమై వ్యాఖ్యానిస్తూ, 'బిసిసిఐ ఇలా చేస్తుండడం నిజంగా అత్యంత దురదృష్టకరం. అంత సంపన్న సంస్థ అయిన బిసిసిఐ ఇలా చేస్తుండడానికి కారణం నాకు బోధపడడం లేదు. ఇదే వారికి బతుకుతెరువు. బిసిసిఐ సాధ్యమైనంత త్వరలో వారి డబ్బు వారికి ఇవ్వాలి' అని అన్నారు.
ఐసిఎల్ క్రీడాకారులపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని బిసిసిఐ ఉపాధ్యక్షుడు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) చైర్మన్ లలిత్ మోడిని అన్యాపదేశంగా కపిల్ నిందించారు. 'వారు మా పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారు. బోర్డులో ఒక వర్గం మాత్రమే ఇలా చేయజూస్తున్నది. అంతే కాదు. ఒకే ఒక వ్యక్తి మా పట్ల కక్ష సాధింపు వైఖరిని అనుసరిస్తున్నారు' అని కపిల్ ఆరోపించారు. మాజీ క్రికెటర్లను నిర్లక్ష్యం చేస్తున్నందుకు బిసిసిఐని కపిల్ విమర్శించారు. తనకు, పోటీ ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసిఎల్)లో చేరిన ఇతర క్రీడాకారులకు పెన్షన్లను విడుదల చేయవలసిందని పాలక వర్గాన్ని ఆదేశించవలసిందిగా ఢిల్లీ హైకోర్టుకు కపిల్ విజ్ఞప్తి చేశారు.
బిసిసిఐ క్రాస్ పరీక్ష నిమిత్తం ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రార్ పవన్ కుమార్ జైన్ ముందు హాజరైనప్పుడు కపిల్ ఈ వాదన చేశారు. బిసిసిఐ తనపైన, ఐసిఎల్ లోని తన సహచరులపైన దండనాత్మక చర్య తీసుకుంటున్నదని సంస్థపై కపిల్ ఆరోపణలు చేశారు. పోటీ ఐసిఎల్ లో చేరిన తరువాత కపిల్ దేవ్, కిరణ్ మోర్, సందీప్ పాటిల్, అజిత్ వాడేకర్, ఈరపల్లి ప్రసన్నతో సహా 15 మంది మాజీ క్రీడాకారులకు పెన్షన్ల చెల్లింపును బిసిసిఐ నిలిపివేసింది.
Pages: -1- 2 News Posted: 14 February, 2009
|