రాహుల్ కాదు, సింగే మా కింగ్!
ప్రధాని కార్యాలయం (పిఎంఒ)లో ఒక జూనియర్ మంత్రిగా రాహుల్ ను చేర్చుకోవాలని తాను ఆసక్తితో ఉన్నట్లు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ స్వయంగా తన అనుచరులతో చెప్పారు. అయితే, ప్రభుత్వంలో పదవిపై దృష్టి పెట్టే ముందు రాహుల్ పార్టీలో పదవీ బాధ్యతలు నిర్వహించి అనుభవం సంపాదించాలని సోనియా అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ కు ఎన్నికల 'మస్కట్' మన్మోహన్ సింగే అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారి కూడా ధ్రువీకరించారు. 'ఎన్నికలలో యుపిఎకి మన్మోహన్ సింగ్ సారథ్యం వహిస్తారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా ఈ నిర్ణయాన్ని బాహాటంగా ప్రకటించారు' అని తివారి తెలిపారు. తదుపరి ప్రధానిగా నేషనలిస్ట్ కాంగ్రెస పార్టీ (ఎన్ సిపి) అధినేత శరద్ పవార్ కు మద్దతు ఇవ్వగలమని శివసేన సూచించడంపై ప్రశ్నకు సమాధానం ఇస్తూ మనీష్ తివారి ఈ విషయం స్పష్టం చేశారు.
ప్రధాన మంత్రి పదవికి తమ అభ్యర్థి మన్మోహన్ సింగ్ కాగలరని కాంగ్రెస్ 'స్పష్టమైన' అభిప్రాయంతోనే ఉందని, యుపిఎ భాగస్వామ్య పక్షాల నుంచి ఇందుకు ఆమోదముద్రను సోనియా గాంధీ త్వరలోనే కోరగలరని కాంగ్రెస్ వర్గాలు తెలియజేశాయి. అయితే, మన్మోహన్ సింగ్ ఎన్నికలలో పోటీ చేసే ప్రసక్తే లేదని ఆ వర్గాలు స్పష్టం చేశాయి.
వామపక్షాలతో చర్చించిన అనంతరం తమ ప్రధాన మంత్రి అభ్యర్థిని యుపిఎ నిర్ణయించగలదన్న ఆర్ జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటన గురించి ప్రస్తావించినప్పుడు, లాలూ సొంత కారణాలపై అలా వ్యాఖ్యానించి ఉండవచ్చునని కాంగ్రెస్ నాయకుడు ఒకరు అభిప్రాయం వ్యక్తం చేశారు. 'బీహార్ లో వామపక్షాల మద్దతు ఎలా అయినా తమకు లభించాలని లాలూ కోరుకుంటున్నారు. అందుకే ఆయన అలా వారికి అనుకూలంగా మాట్లాడి ఉంటారు. వామపక్షాలకు మన్మోహన్ సింగ్ తో సమస్యలు ఉంటాయనే విషయం ఆయనకు తెలుసు' అని ఆ నాయకుడు చెప్పారు.
Pages: -1- -2- 3 News Posted: 19 February, 2009
|