సిద్ధూ 2004 ఎన్నికలలో గెలిచాడు. కాని హత్య కింద పరిగణించని ఒక మృతి కేసులో ఢిల్లీలోని ఒక న్యాయస్థానం తనను దోషిగా నిర్థారించిన తరువాత సిద్ధూ తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. తాను అమృతసర్ సీటుకు రాజీనామా చేసిన తరువాత నిర్వహించిన ఉప ఎన్నికలలో పోటీ చేసేందుకై తన దోష నిర్థారణను సస్పెండ్ చేయాలని అతను కోర్టును అభ్యర్థించాడు. కోర్టు అదే విధంగా సస్పెన్షన్ ఉత్తర్వు జారీ చేయగా నవజ్యోత్ సిద్ధూ తిరిగి ఎంపిగా ఎన్నికయ్యాడు. అతను ప్రస్తుత లోక్ సభలో అమృతసర్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దోషిగా నిర్ధారించడాన్ని సవాల్ చేస్తూ తాను దాఖలు చేసిన అప్పీల్ పై తుది తీర్పు వెలువడేంత వరకు కోర్టు నుంచి తన దోష నిర్థారణను సస్పెండ్ చేసే అవకాశం ఉందని సిద్ధూ కేసును ప్రస్తావిస్తూ సంజయ్ దత్ కూడా సూచించాడు.
లక్నో విశ్వవిద్యాలయం విద్యార్థి యూనియన్ మాజీ నాయకుడైన బబ్లూ 1980 దశకంలో నేర ప్రపంచంలో పరాకాష్ఠను అందుకున్న సమయంలో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు సన్నిహితుడని చెప్పేవారు. ముంబై వరుస పేలుళ్ళ అనంతరం అతను దావూద్ నుంచి విడిపోయినట్లు తెలుస్తున్నది. ఆ పేలుళ్ళ సంఘటన నేర ప్రపంచంలో మతపరంగా చీలిక తీసుకువచ్చింది.
ఈ చీలిక నేపాల్ కు చెందిన రాజకీయ నాయకుడుగా మారిన మాఫియా డాన్ మీర్జా దిల్షాద్ బేగ్ భారత ఉపఖండంలో దావూద్ కు నమ్మినబంటుగా, బబ్లూకు చిరకాల ప్రత్యర్థిగా ఆవిర్భవించడానికి దారి తీసింది. పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ ప్రేరేపణపై డి-కంపెనీ తరఫున భారత వ్యతిరేక కార్యకలాపాలను పర్యవేక్షించడాన్ని దిల్షాద్ ప్రారంభించినప్పుడు కేంద్ర గూఢచారి సంస్థలు అతనిపై తమ దృష్టిని కేంద్రీకరించాయి.
నేపాల్ లో దిల్షాద్ బేగ్ ను మట్టుపెట్టడానికి బబ్లూకు కొన్ని భారతీయ సంస్థలు పరోక్షంగా సాయం చేశాయని అభిజ్ఞ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఇందుకు ప్రతిగా బబ్లూను సింగపూర్ లో 'అరెస్టు చేసి' ఇండియాకు 'అప్పగించారు'. అతనిని ఎన్ కౌంటర్ వంటి చర్యల రూపంలో భారతీయ పోలీసులు అనైతిక పనులకు పూనుకునే అవకాశం లేని రీతిలో ఈ వ్యవహారం సాగించారు. బబ్లూ 2004 లోక్ సభ ఎన్నికలలో సీతాపూర్ నుంచి అప్నా దళ్ టిక్కెట్ పై పోటీ చేశారు. అయితే, 2007 యుపి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసేందుకు అబూ సాలెంకు అప్నా దళ్ టిక్కెట్ ఇవ్వజూపినప్పుడు బబ్లూ పార్టీతో తెగతెంపులు చేసుకున్నారు.