తిరుపతి నుంచే ఎందుకు?
తిరుపతి: ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తిరుపతి నుండి అసెంబ్లీ పోటీ చేయడం దాదాపుగా ఖాయం అయిపోయింది. తిరుపతి నుంచే కాకుండా రాష్ట్రంలో మరో అసెంబ్లీ స్థానం నుంచి కూడా ఆయన పోటీ చేస్తారని అల్లు అరవింద్ వెల్లడించారు. దీంతో ఇప్పుడు అన్ని పార్టీల దృష్టి తిరుపతి సీటుపైనే పడ్డాయి. తిరుపతి రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. చిరంజీవిపై పోటీకి స్థానిక నాయకుల కంటే గ్లామర్ ఉన్న సినీతారను రంగంలోకి దింపితే బాగుంటుందని ఆయా పార్టీలు భావిస్తున్నాయి. చిరంజీవి పోటీ ఖరారు కావడంతో ఇంతకాలం తిరుపతి నుంచి పార్టీ టికెట్ కోసం పోటీపడ్డ తెలుగుదేశం, కాంగ్రెస్, ఇతర పార్టీల ఆశావాహులు వెనక్కు తగ్గే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చిరంజీవి చిత్తూరు జిల్లాలోని తిరుపతి నుంచి పోటీ చేయాలని ఎందుకు నిర్ణయించుకున్నారన్న సందేహాలు సహజంగానే వస్తాయి.
తిరుపతి నియోజకవర్గంలో తిరుపతి నగరంతో పాటు అర్బన్ మండలం లోని రెండు, మూడు గ్రామ పంచాయితీలు ఉన్నాయి. చిరంజీవి తిరుపతి నుండి పోటీ చేయాలని నిర్ణయించడం వెనుక పలుకారణాలున్నాయి. మెగాస్టార్‌కు ఇక్కడ బలమైన అభిమాన సంఘాలు, చిరంజీవికి చెందిన కాపు సామాజిక వర్గం ఓట్లు ఈ నియోజకవర్గంలో అధిక శాతం వున్నాయి. గతంలో తెలుగుదేశం వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు సైతం ఇక్కడి నుండే పోటీ చేసి సిఎం పగ్గాలు చేపట్టడం తెలిసిందే.
Pages: 1 -2- News Posted: 20 February, 2009
|