తిరుపతి నుంచే ఎందుకు?
ఇక చిరంజీవితో తలపడేందుకు కాంగ్రెస్ పార్టీ నుండి రాజ్యసభ మాజీ సభ్యుడు, సినీ నిర్మాత, హీరో డాక్టర్ మోహన్‌బాబు తిరుపతి నుంచి రంగంలోకి దిగే పరిస్థితి కనబడు తోంది. మోహన్‌బాబుకు ఇక్కడ బంధుత్వం, అభిమానుల బలం ఉంది. పైపెచ్చు మోహన్ బాబుకు చెందిన శ్రీవిద్యా నికేతన్ సంస్థలు తిరుపతిలోనే ఉన్నాయి. సినీ రంగంలో సైతం చిరంజీవిని మోహన్‌బాబు పలు విషయాలలో వ్యతిరేకించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవిపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మోహన్ బాబు దిగే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇంతకాలం తిరుపతి టికెట్ ఆశిస్తున్న టిటిడి బోర్డు మాజీ ఛైర్మన్ కరుణాకర్‌రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం.వెంకటరమణలు వెనక్కి తగ్గాల్సి వస్తోందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటునాయి.
తిరుపతి స్థానంపై తెలుగుదేశం పార్టీలో సందిగ్ధం నెలకొంది. దేశం నియోజకవర్గ ఇన్‌ఛార్‌జ కందాటి శంకర్‌రెడ్డి, బిసి నేత జి.నరసింహయాదవ్‌లు తిరుపతి నుంచి పోటీ చేయడానికి పార్టీ టిక్కెట్ ఆశిస్తున్నారు. చిరంజీవి ఇక్కడి నుంచి పోటీ చేయడం ఖాయమైన నేపథ్యంలో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్.కె.రోజా అభ్యర్థిత్వంపై అధినేత ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చిత్తూరు జిల్లాలో నగరి నియోజకవర్గం నుండి 2004లో మంత్రి చెంగా రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయిన రోజా ఈసారి చంద్రగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దిగడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
అయితే చిరంజీవిపై రోజాను పోటీకి దింపితే పోరు రసవత్తరంగా ఉంటుందన్న వ్యూహంతో దేశం అధినేత ఉన్నట్లు తెలుస్తోంది. మరో పక్క తెలుగుదేశం నాయకత్వంలో ఏర్పడ్డ మహాకూటమిలో భాగస్వామి అయిన సిపిఎం ఈసారి తమకు తిరుపతి అసెంబ్లీ గాని, పార్లమెంటు స్థానం కాని కేటాయించవలసిందిగా చంద్రబాబు నాయుడుపై వత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. పొత్తులో భాగంగా కమ్యూనిస్టులకు తిరుపతి నుండి పోటీ చేసి అవకాశం లభిస్తే ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కుమార్ రాజారెడ్డి పేరు వినిపిస్తోంది. మొత్తం మీద ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి వచ్చే ఎన్నికలలో కురుక్షేత్రంగా మారబోతోంది.
Pages: -1- 2 News Posted: 20 February, 2009
|