పతీ, పత్నీ ఔర్ పోస్ట్!
న్యూఢిల్లీ: పతీ, పత్నీ ఔర్ పోస్ట్. బహు ఆసక్తికరమైనదే ఈ ఉదంతం. రాజకీయ పదవుల కోసం భార్యా భర్తల మధ్య పోటీ జరగడం మనకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ప్రభుత్వంలోని ఒక ఉన్నత స్థానం కోసం సీనియర్ అధికారులైన ఇద్దరు భార్యా, భర్త పోటీ పడటం ఇందులోని విశేషం. త్వరలో ఖాళీ కానున్న అత్యున్నత ప్రభుత్వ పదవి కోసం భార్యా, భర్తల మధ్య నడుస్తున్న వినూత్న పోటీ ఇది. జూన్ లో రిటైర్ కానున్న క్యాబినెట్ కార్యదర్శి కె.ఎం. చంద్రశేఖర్ స్థానంలో నియుక్తులు కావాలని కేంద్ర వాణిజ్య కార్యదర్శి జి.కె. పిళ్ళై, ఆయన భార్య కార్మిక శాఖ కార్యదర్శి సుధా పిళ్ళై ఇద్దరూ కోరుకుంటున్నారు. మరొక జంట నిరుపమ, సుధాకర్ రావు కూడా కీలకమైన ప్రభుత్వ పదవులకు అభ్యర్థులుగా ఉన్నారు. కాని ఒకే పదవి కోసం వారు పరస్పరం పోటీ పడడం లేదు.
ప్రస్తుతం కర్నాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సుధాకర్ రావును ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్(ఇసి)లో మూడవ ఎన్నికల కమిషనర్ గా నియమించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) ఎన్ గోపాలస్వామి ఏప్రిల్ లో రిటైరైన తరువాత నవీన్ చావ్లా సిఇసిగా బాధ్యతలు స్వీకరించిన పిమ్మట ఇసిలో ఏర్పడే ఖాళీని సుధాకర రావుతోతో భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.
తదుపరి ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఎవరు నియమితులవుతారన్న విషయంపై నెలకొన్న సందిగ్ధతను ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పటాపంచలు చేస్తూ చావ్లాను ఆ పదవికి ఫైనల్ చాయిస్ గా సూచనప్రాయంగా ప్రకటించింది. కాంగ్రెస్ పట్ల 'పక్షపాత వైఖరితో' వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ నవీన్ చావ్లాకు ఉద్వాసన పలకాలన్న గోపాలస్వామి సిఫార్సును కేంద్రం తిరస్కరించబోతున్నది.
ఇక మూడవ ఎన్నికల కమిషనర్ పదవికి పలు పేర్లు వినవచ్చినప్పటికీ, 2014లో తదుపరి సార్వత్రిక ఎన్నికలు జరిగేంత వరకు పదవిలో కొనసాగగల అధికారిని ఎంపిక చేయాలని కేంద్రం కోరుకుంటున్నది. ఎన్నికల కమిషనర్ల పదవీ కాలం ఆరు సంవత్సరాలు లేదా వారికి 65 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు వారు కొనసాగవచ్చు. ఈ రెండింటిలో ఏది ముందైతే అది అమలులోకి వస్తుంది. ప్రస్తుతం ఇసిలో ఉన్న నవీన్ చావ్లా, ఎస్.వై. ఖురేషి ఇద్దరూ ఉత్తరాది వారైనందున ఏదైనా దక్షిణాది రాష్ట్రం నుంచి ఒక ప్రతినిధిని ఎంపిక చేయాలని కేంద్రం కోరుకుంటున్నది. రాజీవ్ గాంధీ హయాంలో సుధాకర్ రావు ప్రధాని కార్యాలయం (పిఎంఒ)లో విధులు నిర్వర్తించారు.
Pages: 1 -2- News Posted: 22 February, 2009
|