సైంటిస్టులకు 'ఈక్విటి'
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలో కృషిచేస్తున్న శాస్త్రవేత్తలు కార్పొరేట్ రంగంతో అనుసంధానమయ్యే విధానానికి కేంద్ర కేబినెట్ శ్రీకారం చుట్టింది. పలు ప్రభుత్వ పరిశోధక సంస్థలు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు జ్ఞాన సంపద ఆధారిత ప్రైవేట్ కంపెనీల్లో ఈక్విటీ వాటాలను కలిగి ఉండేందుకు దోహదపడే ముఖ్యమైన విధానాన్ని కేబినెట్ సోమవారంనాడు ఆమోదించింది. ప్రభుత్వ పరిశోధన సంస్థల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు టెక్నాలజీ కంపెనీల్లో కృషి చేయడంపై నిషేధం ఉండేది. ఆ విధానానికి ప్రభుత్వం స్వస్తి చెప్పింది.
భారతీయ శాస్త్రవేత్తల పరిశోధనా ఫలితాలు విద్య, పరిశోధక రంగాల నుండి పారిశ్రామిక రంగానికి, మార్కెట్ కు చేరేందుకు తగిన ప్రోత్సాహం అందిచాలని డిపార్ట్ మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (డిఎస్ఐఆర్) ప్రతిపాదించింది. భారత విశ్వవిద్యాలయాలు, పరిశోధక కేంద్రాల్లో జరుగుతున్న పరిశోధనలు పారిశ్రామిక రంగానికి చేరడంలో వైఫల్యముంది. చాలా సందర్భాల్లో, లేబొరేటరీల నుండి పరిశ్రమలకు టెక్నాలజీ చేరినప్పటికీ మార్కెట్ లో విజయవంతంకాని విషయం తెలిసిందే.
భారత పరిశోధక సంస్థలు, ఉన్నత విద్యాసంస్థల అందిస్తున్న పరిశోధక ఫలాలు పరిపూర్ణమైనవి కావని, వ్యాపార అవసరాలకు పనిరావడంలేదని పారిశ్రామిక రంగం ఆరోపించింది. అదే సమయంలో, లేబొరేటరీల్లో కనుగొన్న పరిశోధనలను మార్కెట్ ప్రయోజనాలకు అనుగుణంగా మలచుకునేందుకు, ఆధునీకరించేందుకు తగిన నిధుల్ని పారిశ్రామికరంగం అందజేయడం లేదని పరిశోధకులు ఆరోపిస్తున్నారు 'ఈ కొత్త విధానంతో శాస్త్రవేత్తలు తాము సాధించిన ఫలితాలకు వ్యాపార నైపుణ్యాలను కూడా జోడించేందుకు వీలవుతుంది. మా కృషి మూలంగా పరిశోధనా ఫలితాలను వ్యాపారానికి వినియోగించేందుకు ప్రొత్సాహం లభిస్తుంది'అని డిఎస్ఐఆర్ అధికారి తెలిపారు.
Pages: 1 -2- News Posted: 25 February, 2009
|