తూర్పులో మహిళల పోటీ
కాకినాడ: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి మహిళలు రంగంలోకి దిగుతున్నారు. మహిళలకు మూడో వంతు సీట్లు కేటాయిస్తామని ప్రధాన పార్టీలు ప్రకటించిన నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో కనీసం ఆరు సీట్లు తమకు కేటాయించాలని ఆయా పార్టీల మహిళా నాయకులు కోరుతున్నారు. తెలుగు దేశం, కాంగ్రెస్ పార్టీల కంటె ప్రజారాజ్యంలో వారి ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఇరవయ్యొక్క నియోజకవర్గాలుగల ఈ జిల్లాలో ప్రస్తుతం ఒక్క నియోజకవర్గానికే(నగరం-పాముల రాజేశ్వరి) మహిళా ప్రాతినిధ్యం ఉంది. అంతకు ముందు ఎన్నికల్లో మూడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం మహిళా అభ్యర్ధులు గెలుపొందారు.
కాంగ్రెస్ పార్టీ కూడా క్రితం సారి ఎన్నికల్లో మహిళలకు ఎక్కువ స్థానాలు కేటాయిస్తామని చెప్పి, అర్హులైన అభ్యర్ధులు అందుబాటులో లేక ఒక్క అభ్యర్ధినే నిలబెట్టింది. ఈసారి ఈ రెండు పార్టీలతో పాటు ప్రజారాజ్యం కూడా తూర్పు గోదావరి జిల్లాలో కనీసం ఆరుగురు మహిళా అభ్యర్ధులను పోటీకి దింపడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఇక్కడ ఇతర స్థానాల కంటె ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో బరిలోకి దిగనున్న మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. అమలాపురం ఎస్సీ రిజర్వుడు సీటుకోసం మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కొల్లి నిర్మల కుమారి ప్రయ్నత్నిస్తున్నారు. తెలుగు దేశం టిక్కెట్ కోసం పండు స్వరూప రాణి, ప్రజారాజ్యం టిక్కెట్ కోసం మాజీ ఎమ్మెల్యే చిల్లా జగదీశ్వరి, పెయ్యల సంధ్య పోటీ పడుతున్నారు. మాల మహానాడు మాజీ అధ్యక్షుడు స్వర్గీయ పివి రావు సతీమణి ప్రమీల కూడా ఈ సీటు పై ఆసక్తి చూపుతున్నారని తెలిసింది.
Pages: 1 -2- News Posted: 25 February, 2009
|